Ponguleti Srinivas Reddy : మీకు ఖలేజా ఉంటే నన్ను సస్పెండ్ చేయండి, బీఆర్ఎస్ అధిష్ఠానానికి పొంగులేటి సవాల్
Ponguleti Srinivas Reddy : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ అధిష్ఠానానికి సవాల్ విసిరారు. దమ్ముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు.
Ponguleti Srinivas Reddy : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. నిరుద్యోగ భృతి హామీ ఇంత వరకు ఎందుకు అమలుచేయలేదని ప్రశ్నించారు. సోమవారం అశ్వరావుపేట నియోజకవర్గం ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన...బంగారు తెలంగాణలో పోడు రైతులకు పట్టాలు పంపిణీ ఎప్పుడు జరుగుతాయని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయని నాడు ఉద్యమం చేసిన వారి ఆకాంక్షలు నేటికీ నేరవేరలేదని విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు కలగానే మిగిలిపోయాయన్నారు. పంచాయతీలకు పెండింగ్ బిల్లులు ఇవ్వడంలేదని, దీంతో సర్పంచ్ లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రతి పంచాయతీకి రూ. 10 లక్షలు ఇస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని పొంగులేటి ప్రశ్నించారు.
ఖలేజా ఉంటే నన్ను సస్పెండ్ చేయండి
"తెలంగాణ వస్తే మా బతుకులు మారతాయని భావించం. కానీ అది జరగలేదు. ఎన్నికలు, ఉపఎన్నికలు వచ్చినప్పుడు రెండు ఇళ్లు కట్టి వాటినే పేపర్లలో వేసి ప్రచారం చేసుకున్నారు. ప్రతీ గ్రామపంచాయతీల్లో బిల్లులు పెండింగ్ పెట్టారు. పొంగులేటి పార్టీ మారినందుకు కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. దీనిపై చర్చకు నేను సిద్ధం. మీరు ఎవరికి ఎంత ఇచ్చారో నాకు తెలుసు. నిన్నటి నిన్న వైరా నియోజకవర్గంలో 20 మందిని సస్పెండ్ చేశారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశా. వీళ్లని ఓ మండల స్థాయి నాయకుడు సస్పెండ్ చేశారు. మీకు ఖలేజా ఉంటే నన్ను చేయండి. శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉందా అని కొందరు ప్రశ్నించారంట. ఈ విషయంపై మిమల్ని మీరు ప్రశ్నించారు. టైం వచ్చినప్పుడు మీ అందరికీ సమాధానం చెప్తా. ప్రజాభీష్టం మేరకు పార్టీ మార్పు ఉంటుంది. అధికారులకు ఇదే హెచ్చరిక మీరు ప్రభుత్వ ఉద్యోగులు. నాతే పయనించే ఎవరినైనా ఇబ్బందిపెడితే ప్రతిఫలం ఉంటుంది. అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండదు. పోలీసులు నా అనుచరులను బెదిరిస్తున్నారు. ఇది మంచిపద్ధతి కాదు." - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కార్యకర్తల అభిప్రాయం మేరకు పార్టీపై నిర్ణయం
తన రాజకీయ భవిష్యత్‌పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టత ఇచ్చారు కానీ పార్టీ మారే నిర్ణయంపై ఇంకా తేల్చలేదు. అనుచరులు, ప్రజాభిప్రాయం ప్రకారమే పార్టీ మారే నిర్ణయం తీసుకుంటామన్నారు. అశ్వరావుపేట అభ్యర్థిగా జారే ఆదినారాయణను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరినా తన అనుచరులకు టికెట్ ఇచ్చే ధైర్యం ఉంది కాబట్టే అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రులు అంటే ఎన్టీఆర్, వైఎస్ఆర్ లా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని సీఎం కేసీఆర్ కు సెటైర్లు వేశారు. దమ్ముంటే తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ చేశారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఏం చేసిందో చెప్పాలన్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభకు జనాన్ని ఎలా తరలించారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటానని స్పష్టం చేశారు. తన వర్గాన్ని ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. ఆదివారం పొంగులేటితో భేటీ అయిన 20 మంది బీఆర్ఎస్ నేతలను పార్టీ సస్పెండ్ చేసింది.