Breaking News Live: ట్విట్టర్ సేవలకు కాసేపు అంతరాయం, ఇబ్బందులు పడ్డ వినియోగదారులు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఈశాన్య దిశ నుంచి ఉపరితల గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చలి, వేడి వాతావరణం కొనసాగుతోంది. రాత్రుళ్లు చల్లగా ఉంటే మధ్యాహ్నం మాత్రం వేడిగా, మళ్లీ కోస్తాంధ్రలో మాత్రం కాస్తంత ఉక్కగా ఉంది. ఈ రోజు అత్యల్పంగా విశాఖ ఏజెన్సీ అరకు వ్యాలీలో 8.3 డిగ్రీలు నమోదయ్యింది. మరో పక్కనేమో అత్యధికంగా కర్నూలు జిల్లా నంధ్యాలలో 36 డిగ్రీలు నమోదయ్యింది. ఇలాంటి వాతావరణం మరో మూడు రోజులు ఉంటుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు.
హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం సమయంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది. నిర్మలంగా ఉంటుంది. ఉదయం సమయంలో కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 31 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 6 కిలో మీటర్ల నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. ముందు రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 30.7 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.2 డిగ్రీలుగా నమోదైంది.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు బాగా తగ్గింది. గ్రాముకు రూ.20 చొప్పున తగ్గింది. వెండి ధర కూడా కిలోకు రూ.400 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.46,200 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,400 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.67,800గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,800 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,200 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,400గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,800గా ఉంది.
ట్విట్టర్ సేవలకు కాసేపు అంతరాయం, ఇబ్బందులు పడ్డ వినియోగదారులు
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సేవలకు గురువారం రాత్రి కొంత సమయం నిలిచిపోయాయి. సైట్, మొబైల్ అప్లికేషన్ ద్వారా నావిగేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు స్క్రీన్‌పై 'ఏదో తప్పు జరిగింది' 'మళ్లీ ప్రయత్నించండి' వంటి సందేశాలు వచ్చాయని వినియోగదారులు పేర్కొన్నారు. కొంతమంది వినియోగదారులకు ట్వీట్ చేయడంలో సమస్య ఉంది, మరికొందరు ఇప్పటికే ఉన్న ట్వీట్‌పై కామెంట్స్ లోడ్ చేయలేకపోయారు. ట్విట్టర్ సపోర్ట్ అధికారిక హ్యాండిల్‌కు కూడా స్క్రీన్‌పై లోడ్ చేయడంలో సమస్య ఉందని వచ్చిందని తెలుస్తోంది.
పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబును అడ్డుకున్న మహిళలు
తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును పి.గన్నవరంలోని బాలయోగి కాలనీ వాసులు అడ్డుకున్నారు. నివాస గృహాల మధ్యలో వాటర్ ట్యాంకు నిర్మాణం చేపట్టొద్దని గ్రామస్థుల ఆందోళన చేశారు. ఉద్రిక్తత తలెత్తడంతో నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం వ్యక్తిగత పూచీ కత్తుపై విడుదల చేశారు.
రేపు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
రేపు గుంటూరు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10.15 గంటలకు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ సీఎం ప్రారంభిస్తారు. 11 గంటలకు తాడేపల్లి మండలం కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రంలో ఆధ్యాత్మిక కేంద్రానికి సీఎం భూమిపూజ చేయనున్నారు. ఇస్కాన్ (బెంగళూరు)కు చెందిన హరేకృష్ణ మూమెంట్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఆరున్నర ఎకరాలలో జాతీయ రహదారి పక్కన కొలనుకొండలో హరేకృష్ణ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఇస్కాన్ భావిస్తుంది.
ఓయూలో ఉద్రిక్తత... బహుజన, టీఆర్ఎస్వీ విద్యార్థి సంఘాల ఘర్షణ
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీ ఎన్ఆర్ఎస్ హాస్టల్ వద్ద టీఆర్ఎస్వీ విద్యార్థులు బహుజన విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. బహుజన విద్యార్థి సంఘాలు నాయకులు హాస్టల్ వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు కర్రలతో బహుజన విద్యార్థుల పైన దాడికి దిగారు. పోలీసులు బహుజన విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్నారు.
BJP MLA Raja Singh వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. రాబోయే రోజుల్లో ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన తెలిపారు. అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య జరిగి ఇప్పటికి ఏడాది గడిచినా కేసు తేలలేదని.. ఈ కేసు నుండి ప్రభుత్వం చాలామంది నిందితులను కాపాడుతోందని ఆరోపించారు. వినుకొండ అనే వామన్ రావు దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.