TSPSC Paper Leak: జగిత్యాల టు హైదరాబాద్ వయా ఆప్గనిస్థాన్- రాజశేఖర్ మామూలోడు కాదు- ఎన్‌ఆర్‌ఐతో కూడా గ్రూప్-1 రాయించాడు!
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న రాజశేఖర్.. విదేశాల్లో ఉన్న దంపతులను తీసుకొచ్చి మరీ పరీక్షలు రాయించినట్లు తెలుస్తోంది.
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన అట్ల రాజశేఖర్ సమీప బంధువులు ఇద్దరూ విదేశాల నుంచి వచ్చి గ్రూప్ -1 ప్రాథమిక పరీక్షకు హాజరు అయినట్లు స్థానికులు చెబుతున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు ఇక్కడకు వచ్చి గ్రూప్స్ రాస్తున్న తీరుపై స్థానికంగా చర్చ సాగుతోంది. అయితే వీరిద్దరూ గ్రూప్-1 పరీక్షలో ఉత్తర్ణత సాధించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ఆ దంపతులు ఎవరు, వారికి పేపర్ లీకైందా, నిజంగానే వారు పరీక్షలు రాసి వెళ్లారా, అర్హత సాధించారా వంటి అంశాలను తెలుసుకునేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.
రాజశేఖర్ 2012లో ఉపాధి కోసం అఫ్గానిస్థాన్ వెళ్లి నాలుగేళ్ పాటు అక్కడే ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అయితే 2016లో తిరిగి స్వగ్రామానికి వచ్చిన అతడికి కంప్యూటర్ హార్డ్ వేర్ పై పట్టు ఉండడంతో హైదరాబాద్ లోని పలు కంప్యూటర్ విభాగాల్లో అడ్మిన్ గా కీలక బాధ్యతల్ని నిర్వర్తించినట్లు సమాచారం. అయితే కరీంనగర్ కు చెందిన దగ్గరి బంధువుల ద్వారా టీఎస్పీఎస్సీలో తాత్కాలిక ఉద్యోగిగా రాజశేఖర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ ఉద్యోగంలో చేరిన తర్వాతే ఆయన స్వగ్రామంలో ఓ భవనాన్ని నిర్మించుకున్నాడని వివరిస్తున్నారు. గ్రామానికి వచ్చిన సమయంలో కొంతమంది సన్నిహితులోనే ఉండేవాడని.. జీతం లక్షల్లో వస్తుందనుకునేవారమని గ్రామస్థులు వెల్లడిస్తున్నారు.
సిట్ నివేదికలో కీలక అంశాలు
టీఎస్పీఎస్సీ సెక్రటరీ కంప్యూటర్‌ని హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ని దొంగిలించాడు రాజశేఖర్. పాస్‌వర్డ్‌ని తాను ఎక్కడా రాయలేదని టీఎస్పీఎస్సీ ఉద్యోగి శంకర్ లక్ష్మి చెబుతున్నారు. శంకర్ లక్ష్మి కంప్యూటర్ హ్యాక్ చేసి పేపర్లు కాపీ చేశాడు రాజశేఖర్. పెన్‌డ్రైవ్ ద్వారా 5 పరీక్షా పత్రాలను కాపీ చేశాడు. కాపీ చేసిన పెన్‌డ్రైవ్‌ను ప్రవీణ్‌కు ఇచ్చాడు. ప్రవీణ్ ఏఈ పరీక్ష పత్రాన్ని రేణుకకు అమ్మాడు. ఫిబ్రవరి 27నే పేపర్‌ను కాపీ చేశాడు రాజశేఖర్. గ్రూప్-1 పరీక్షాపత్రం లీకైనట్లు సిట్ గుర్తించింది. ప్రవీణ్‌కు 103 మార్కులు రావడంపై సిట్ విచారణ చేపట్టింది. సెక్రటరీ దగ్గర పీఏగా చేస్తూ ప్రవీణ్ గ్రూప్-1 పరీక్షా పత్రాన్ని కొట్టేసినట్లు నిర్ధారించారు. దాదాపు ఐదు పరీక్షా పత్రాలను పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇందులో రెండు రోజుల్లోనే నాలుగు పేపర్లను రాజశేఖర్ కాపీ చేసుకున్నాడు.
పాస్ వర్డ్ ఎలా బయటకు వచ్చిందనే విషయంపై ఆరా
ఫిబ్రవరి 27న పేపర్ లను ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో కాపీ చేశాడు రాజశేఖర్. ఇందులో జులైలో జరగాల్సిన జూనియర్ లెక్చర్ పరీక్ష పేపర్ కూడా ఉందని సిట్ దర్యాప్తులో తేలింది. అనంతరం ప్రవీణ్ రేణుకకు పేపర్లు ఇచ్చాడు. అయితే పాస్‌వర్డ్ ఎలా బయటకు వచ్చిందనే విషయంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రవీణ్ పాస్‌వర్డ్‌ను శంకర్ లక్ష్మి అనే ఉద్యోగి డైరీ నుంచి కొట్టేశానని సిట్ అధికారులకు చెప్పాడు. అయితే శంకర్ లక్ష్మీ మాత్రం పాస్‌వర్డ్‌ను డైరీలో రాయలేదని అంటున్నారు. శంకర్ లక్ష్మీ పాత్రపై సిట్ దర్యాప్తు చేస్తుంది.