Gangula Kamalakar: నాని ఎక్కడ పుట్టినా ‘దసరా’ తర్వాత తెలంగాణ బిడ్డయ్యాడు: మంత్రి గంగుల
తెలంగాణ సంస్కృతిలోనే ఒక గొప్పదనం ఉందన్నారు మంత్రి గంగుల కమలాకర్, మానేరు నీళ్లు తాగిన మా సిరిసిల్ల బిడ్డ వేణు బలగంతో, పెద్దపెల్లి బిడ్డ శ్రీకాంత్ ఓదెల దసరాతో కరీంనగర్ సత్తా చాటారన్నారు.
కరీంనగర్ అడ్డగా బ్రహ్మోత్సవాలు, కళోత్సవాలు, విజయోత్సవాలు
- మానేరు నీళ్లలోనే పవర్ ఉంది, తెలంగాణ సంస్ర్రుతిలోనే గొప్పదనం ఉంది
- దాదాసాహెబ్ పాల్కె, జ్ణానపీఠ్ అందుకున్న గొప్పతనం కరీంనగర్ సొంతం
- గుండాల కారెక్టర్లకు వాడే దశనుండి తెలంగాణ భాష ఉంటేనే హిట్ అనే దశకు
- దసరా యూనిట్ సభ్యులకు శుబాకాంక్షలు తెలిపిన మంత్రి గంగుల కమలాకర్
- మంత్రి గంగుల కమలాకర్ కృషితో దసరా ఈవెంట్ అద్భుతంగా వచ్చింది – హీరో నాని
బ్రహ్మోత్సవాలకు, కళోత్సవాలకు, విజయోత్సవాలకు వేదికగా కరీంనగర్ మారిందన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్లో బుధవారం జరిగిన దసరా సినిమా సక్సెస్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా మంత్రి గంగుల హాజరై మాట్లాడారు. మానేరు నీళ్లలోనే ఒక పవర్ ఉందని, తెలంగాణ సంస్కృతిలోనే ఒక గొప్పదనం ఉందన్నారు, మానేరు నీళ్లు తాగిన మా సిరిసిల్ల బిడ్డ వేణు బలగంతో, పెద్దపెల్లి బిడ్డ శ్రీకాంత్ ఓదెల దసరాతో కరీంనగర్ సత్తా చాటారన్నారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించడం వల్లే మట్టిలోని మాణిక్యాలు బైటకొస్తున్నాయని అన్నారు మంత్రి గంగుల. కాసర్ల శ్యామ్ గొప్ప పాటలు రాస్తు తెలంగాణ సంస్కృతిని బైటకు తీసుకొస్తున్నారు అన్నారు. నటుడు నాని ఎక్కడ పుట్టినా దసరా సినిమా తర్వాత మా తెలంగాణ బిడ్డయ్యాడని, గతంలో తెలంగాణ బాష గుండాలకు పెట్టారు నేడు తెలంగాణ భాష లేకపోతే సినిమాలే లేని పరిస్థితికి వచ్చిందని గర్వంగా ఉందన్నారు.
తెలంగాణ భాషతో సినిమా తీస్తే సూపర్ హిట్ అనేది సినిమా ఇండస్ట్రీలో స్థిరపడడం శుభపరిణామం అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి దాదాసాహెబ్ పాల్కె అవార్డు అందుకున్న పైడి జయరాజ్, జ్ణానపీఠ్ పొందిన సినారే ఇలా నాటి తరంనుండి నేటి తరం వరకూ సినిమాకు ఆయువుపట్టుగా కరీంనగర్ నిలుస్తూనే ఉందన్నారు మంత్రి గంగుల కమలాకర్. దసరా సినిమా యూనిట్ సభ్యులందరికీ మంత్రి గంగుల శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హీరో నాని మాట్లాడుతూ.. కరీంనగర్ ఎనర్జీ అద్బుతంగా ఉందన్నారు. ఈవెంట్ సక్సెస్ కు సహకరించిన మంత్రి గంగుల కమలాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కరీంనగర్లో అద్బుతమైన అభివృద్దితో పాటు ప్రకృతి రమణీయత ఆకట్టుకుందని త్వరలోనే ఇక్కడ షూటింగ్ కోసం ప్లాన్ చేస్తానన్నారు నాని.
యూఎస్‌లో 1.5 మిలియన్ మార్కును దాటిన ‘దసరా’
నేచురల్ స్టార్ నాని, ‘మహానటి’ కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన ‘దసరా’ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. అమెరికాలో ఈ సినిమా నాని కెరీర్ హయ్యస్ట్‌గా నిలిచింది. 1.55 మిలియన్ డాలర్ల మార్కును వీకెండ్‌లోనే దాటేసి 2 మిలియన్ వైపుగా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు యూఎస్‌ఏలో నాని హయ్యస్ట్ గ్రాసర్‌గా ‘జెర్సీ’ ఉంది. ఇప్పుడు ‘దసరా’ ఆ రికార్డును కూడా దాటేసింది.
‘దసరా’ మొదటి రోజు (ప్రీమియర్‌లతో సహా) మొత్తం $850K కలెక్ట్ చేసి US బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు నాని సినిమాల్లో దసరాదే బెస్ట్ ఓపెనింగ్. నార్త్ ఇండియాలో మొదటి రోజు 'దసరా'కు 40 లక్షల రూపాయల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అయితే వీకెండ్‌లో సినిమా పుంజుకుంది. ఇప్పటివరకు దాదాపు రూ. రెండు కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చి ఉంటాయని అంచనా. ఇప్పటివరకు ఓవరాల్‌గా నాని కెరీర్‌లో పెద్ద హిట్ ‘ఎంసీఏ’. ఈ సినిమా రూ.40 కోట్ల షేర్ వసూలు చేసింది. ‘దసరా’ ఈ మార్కును మొదటి వీకెండ్‌కే అధిగమించనుంది. ఆదివారం కలెక్షన్లు ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది.