తెలుగు కవులకు కేంద్ర సాహిత్య పురస్కారం-2022
పత్తిపాక మోహన్ బాల సాహిత్య పురస్కారానికి, పళ్లిపట్టు నాగరాజు యువ పురస్కారానికి ఎంపికయ్యారు. కేంద్ర సాహిత్య అకాడమీ 2022కి గాను ఈ అవార్డులను ప్రకటించింది.
కేంద్ర సాహిత్య అకాడమీ 2022వ సంవత్సరానికిగాను బాల, యువ పురస్కారాలను ప్రకటించింది. అయితే ప్రముఖ కవి, నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సంపాదకుడు, సిరిసిల్లవాసి డా. పత్తిపాక మోహన్ బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. అలాగే ఏపీలోని తిరుపతి జిల్లాకు చెందిన యువకవి, తెలుగు ఉపాధ్యాయుడు పళ్లిపట్టు నాగరాజును యువ పురస్కారం వరించింది. అయితే పత్తిపాక మోహన్ "బాలల తాత బాపూజీ", పళ్లిపట్టు నాగరాజు "యాలై పూడ్సింది" కవితా సంకలనాలకు ఈ అవార్డులు లభించాయి.
కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబారా నేతృత్వంలో ఢిల్లీలో బుధవారం సభ్యులంతా సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలోనే 22 భాషలకు (తెలుగు, అస్సామీ, బెంగాలీ, బోడో, దోగ్రి, ఆంగ్లం, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరి, కొంకణి, మైథిలీ, మళయాళం, మణిపురి, మరాఠీ, నేపాలి, ఒడియా, రాజస్థానీ, సంస్కృతం, సింధి, తమిళం, ఉర్దూ) సంబంధించి జ్యూరీ ఎంపిక చేసిన రచనలకు పురస్కారాలను ప్రకటించారు. అవార్డులకు ఎంపికైన కవులు, రచయితలకు నవంబర్ 14వ తేదీన ఢిల్లీలో నిర్వహించే వేడుకలో 50 వేల రూపాయల చెక్కుతో పాటు తామర్ ఫలకం అందజేస్తారు.
సీఎం కేసీఆర్ అభినందనలు..
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి తెలంగాణకు చెందిన పత్తిపాక మోహన్ ఎంపిక అవడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రానికే గర్వకారణం అని తెలిపారు. మనందరి బాపూజీ గాంధీజీపై రాసిన బాల సాహిత్యానికి తెలంగాణ సాహితీవేత్తకు ఈ అవార్డు దక్కడం, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భానికి మరింత వన్నె తెచ్చిందన్నారు. డాక్టర్ సినారె శిష్యుడైన పత్తిపాక మోహన్.. మరింత ఎత్తుకు ఎదగాలని, ఇలాగే మరిన్ని పురస్కారాలను అందుకోవాలని తెలిపారు.
కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారానికి డా. పత్తిపాక మోహన్ ఎంపికవడం పట్ల సీఎం శ్రీ కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. గాంధీజీపై ఆయన రాసిన 'బాలల తాతా బాపూజీ' గేయ కథకు ఈ పురస్కారం దక్కడం స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భానికి మరింత శోభనిచ్చిందన్నారు. @sahityaakademi pic.twitter.com/7mml7FOLQd
— Telangana CMO (@TelanganaCMO) August 24, 2022
పిల్లల కోసం ఎన్నెన్నో రచనలు చేసిన పత్తిపాక మోహన్..
సిరిసిల్లలోని చేనేత కుటుంబంలో జన్మించిన పత్తిపాక మోహన్ పిల్లల కోసం అనేక రచనలు చేశారు. పురస్కారానికి ఎంపికైన బాలల తాత బాపూజీతోపాటు పిల్లల కోసం మన కవులు, జో.. అచ్యుతానంద జోజో ముకుందా.. ఒక్కేసి పువ్వేసి చందమామ, చందమామ రావే వంటి అనేక రచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లోని కథలను తెలుగులోకి అనువదించారు.
చిత్తూరు జిల్లా యాసలో కష్ట జీవులు, బడుగుల బతుకులపై యాలై పూడ్సింది శీర్షికతో రచించిన కవితా సంపుటిని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికే చేసింది. తిరుపతి జిల్లా సత్యమేడు మండలం రంగనాథపురం మిట్టిండ్లు గ్రామంలో నాగరాజు జన్మించారు. అితే ఆయన 2016లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికై.. ప్రస్తుతం పెద్దూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు బోధిస్తున్నారు. ఈయన రెక్కలు(మినీ కవితలు), మమ్మీ అమ్మ కావాలి, మనసుపొరల్లో వంటి కథలు రాశారు. నాగరాజు కవితలు ఎక్కువగా కన్నడ, ఆంగ్ల భాషల్లోకి అనువాదం అయ్యాయి.