DH Srinivasa Rao: కొత్తగూడెం ఎమ్మెల్యేపై డీహెచ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు, ఆయనకు రెస్ట్ ఇద్దామంటూ కామెంట్స్
DH Srinivasa Rao: తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస రావు కొత్తగూడెం ఎమ్మెల్యేపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఆయనకు విశ్రాంతి ఇద్దామంటూ వ్యాఖ్యానించారు.
DH Srinivasa Rao: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి వార్తల్లో నిలిచారు. రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు నిజం అనేలా పలు సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గం నుండి ఆయన పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, అందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మెప్పించేలా ప్రవర్తిస్తున్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కొత్తగూడెం నుండి పోటీకి సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు పంపిస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేపై పరోక్షంగా విమర్శలు చేశారు. పాల్వంచ మండలంలో డీహెచ్ శ్రీనివాసరావు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై పరోక్షంగా విమర్శలు చేశారు.
'మా ఉద్యోగులు అందరికీ 60 సంవత్సరాలే రిటైర్మెంట్ వయస్సు. ఆ తర్వాత పంపించి వేస్తారు. అట్లాగే మన స్థానిక ప్రజా ప్రతినిధి వయస్సు 80 సంవత్సరాలు. కొత్తగూడెం నియోజకవర్గానికి ఆయన ఎంతో చేశారు. ఇప్పటికి కూడా ఆయనను కష్టపెట్టడం బాగుండదు. చాలా పెద్దాయన అందుకే ఆయనకు రెస్ట్ ఇద్దాం. అలాగే చివరి సారి జరిగిన ఎన్నికల్లో.. ఇవే చివరి ఎన్నికలు, ఇక నేను కష్టపడలేను, ఇదే నా చివరిసారి, ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని ఆయన చెప్పారు. ఆయన అడిగినట్లే మీరంతా అవకాశం ఇచ్చారు. ఇంకోసారి అవకాశం ఇవ్వండి అని మళ్లీ ఈసారి అడుగుతున్నారు. అరె.. ఇంకెన్ని సార్లు అవకాశం ఇస్తాం. మన జీఎస్ఆర్ ట్రస్ట్ కూడా ప్రజల్లో అలాంటి అవగాహన కల్పిస్తోంది. రేపు నేనేదో కావాలని మీకిది చెప్పడం లేదు. మనలో మనకు అవగాహన రావాలి. వాళ్ల ఆస్తులు, అంతస్థులు, అధికారం అడగడం లేదు. ప్రజాప్రతినిధులుగా వారి బాధ్యతలను నెరవేర్చమని కోరుతున్నాం' అని గడల శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు.
శ్రీమంతుడు డైలాగ్‌తో చర్చనీయాంశమైన డీహెచ్
కొన్ని రోజుల క్రితం కొత్తగూడెంలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేస్తానన్నారు. అక్కడితో ఆగకుండా.. కొత్తగూడెం నుండి చాలా మంది చాలా తీసుకున్నారని, వాళ్లందరూ కూడా కొత్తగూడానికి తిరిగి ఇచ్చేయ్యాలని, లేకపోతే ఇచ్చేలా చేద్దామంటూ శ్రీమంతుడు సినిమా డైలాగ్ కొట్టి హాట్ టాపిక్ గా నిలిచారు. అవకాశం దొరికిన ప్రతీ సందర్భంలోనూ శ్రీనివాసరావు తాను కొత్తగూడెం నుండి పోటీ చేయడానికి సిద్ధం అనే మెసేజ్ పంపిస్తున్నారు.
అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా శ్రీనివాస రావు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పైగా తను చేసిన పనిని సమర్థించుకున్నారు. ఒక్కసారి కాదు వందసార్లయినా బరాబర్ మొక్కుతానని వినయ విధేయత ప్రదర్శించారు. జలగం, వనమా గ్రూపులుగా విడిపోయిన కొత్తగూడెం నియోజకవర్గం ఎన్నికల బరిలో నిలవాలని గట్టిగా కోరుకుంటున్నారు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాసరావు.