Minister KTR: మరోసారి ఔదార్యం చేసుకున్న మంత్రి కేటీఆర్ - దివ్యాంగుడికి ఆటో అందజేత
Minister KTR: సిరిసిల్లలో ఉన్న ఓ దివ్యాంగుడికి మంత్రి కేటీఆర్ ఆటో అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. రెండ్రోజుల క్రితం ఓ కార్యక్రమం కోసం మంత్రి అక్కడకు రాగా.. దివ్యాంగుడు ఆటో కావాలని అడిగాడు.
Minister KTR: ఆపదలో ఉన్న వారిని సాయం చేసి మంచి మనసును చాటుకునే మంత్రి కేటీఆర్ మరోసారి పెద్దమనసు చాటుకున్నారు. అడిగిన రెండు రోజుల్లోనే ఓ దివ్యాంగుడికి ఆటో అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం నారాయణపూర్ కు చెందిన ఆకారపు నర్సయ్యకు పుట్టుకతోనే రెండు కాళ్ల వంకరపోయాయి. అయితే ఈయనకు పెళ్లి కాగా.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారే మాధురి, గౌతమి. అయితే కొంతకాలం క్రితమే ఆయన భార్య చనిపోయింది. చేతనైన పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. మూడు రోజుల కిందట అంటే ఫిబ్రవరి 28వ తేదీ మంగళవారం రోజు మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేటలో వృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చారు. విషయం తెలుసుకున్న నర్సయ్య.. బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సహకరాంతో అమాత్యుడిని కలిసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఆటో ఇవ్వాలని నర్సయ్య కోరగా.. మంత్రి కేటీఆర్ ఇస్తానని హామీ ఇచ్చారు.
అడిగిన రెండ్రోజుల్లోనే ఆటో అందించిన మంత్రి కేటీఆర్
ఈ క్రమంలోనే కలెక్టర్ అనురాగ్ జయంతితో మాట్లాడి ఆటో మంజూరు చేయించారు. ఆయన కోరిన రెండు రోజుల్లోనే నర్సయ్య ఇంటికి ఆటో చేరేలా చేశారు మంత్రి కేటీఆర్. గురువారం రోజు ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద కొత్త ఆటోను నర్సయ్యకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్యతో కలిసి ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు అందజేశారు. అయితే అడిగిన వెంటనే స్పందించి తనకు ఆటో అందేలా చేసిన మంత్రి కేటీఆర్ కు నర్సయ్య కృతజ్ఞతలు తెలిపారు. తన పిల్లలను కాపాడుకునేందుకు, చక్కగా చదివించేందుకు ఈ ఆటో ఎంతగానో సాయపడుతుందని వివరించారు. తన ఇద్దరు కూతుళ్లను ఆటోలో కూర్చోబెట్టుకొని తిప్పాడు. ఇక్కడ సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, పీఏసీఎస్ ఛైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ అపేరా సుల్తానా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్ కుమార్, తహసీల్దార్ జయంత్ కుమార్, ఎంపీడీఓ చిరంజీవి, నాయకులు మాజీద్, రమేష్, బాల్ రెడ్డి, ఉదయ్, తదితరులు ఉన్నారు.
గతేడాది డిసెంబర్ లో చదువుల తల్లికి సాయంగా..
ఎంబీబీఎస్ చదవాలనే లక్ష్యం కానీ నిరుపదే కుటుంబం. తల్లిదండ్రులు కూలీ పనిచేస్తే గానీ ఇళ్లు గడవని పరిస్థితి. అయినా అనుకున్నది సాధించాలనే తపనతో అడుగు ముందుకేసింది. రాత్రింబవళ్లు కష్టపడి చదివి నీట్ లో మంచి ర్యాంక్ సాధించింది. హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ కూడా సాధించింది. అయితే ఈ చదువుల సరస్వతికి లక్ష్మీ కటాక్షం లేకపోయింది. ఎంబీబీఎస్ అంటే లక్షలతో పని. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న ఆ విద్యార్థినికి మంత్రి కేటీఆర్ నుంచి భరోసా అందించింది. ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న ఆ విద్యార్థిని పరిస్థితి ఒకరు ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. సాయం చేయడంలో అందరికన్నా ఒక అడుగు ముందుంటే మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఆ పేద విద్యార్థిని చదువు పూర్తి చేసేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.