Mancherial Govt Hospital: ఆసుపత్రిలో శిశువులు తారుమారు - డీఎన్‌ఏ పరీక్షలకు శాంపిల్స్!
Mancherial News: మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అఫ్పుడే పుట్టిన శిశువులు తారుమారయ్యారు. బాధితులు ఆందోళన చేస్తుండగా.. డీఎన్ఏ పరీక్షలు చేసి ఎవరి బిడ్డలను వారికిస్తామన్నారు.
![Mancherial Govt Hospital: ఆసుపత్రిలో శిశువులు తారుమారు - డీఎన్‌ఏ పరీక్షలకు శాంపిల్స్! Mancherial News New born babies swapped at govt hospital, Telangana Mancherial Govt Hospital: ఆసుపత్రిలో శిశువులు తారుమారు - డీఎన్‌ఏ పరీక్షలకు శాంపిల్స్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/28/22fcb399b6a84aa7a988e4764d5635971672205977291519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mancherial News: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది చేసిన నిర్లక్ష్యం వల్ల అప్పుడే పుట్టిన పిల్లలు తారుమారు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఓ గర్భిణి ప్రసవం కోసం ఇటీవల ఆసుపత్రికి రాగా విధుల్లో ఉన్న వైద్యురాలు మంగళవారం రాత్రి శస్త్రచికిత్స చేసింది. కొద్ది నిమిషాల తేడాతో మరో గర్భిణికి సైతం శస్త్ర చికిత్స చేయగా ఒకరికి ఆడ, మరొకరికి మగ బిడ్డ జన్మించారు. అయితే ఓ బాధితురాలుకు ఆడ బిడ్డ పుడితే మగ బిడ్డని ఇవ్వడం ఏంటని ఆందోళన చేపట్టారు.
అసలేం జరిగిందంటే..?
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చెన్నూర్ మండలానికి చెందిన దుర్గం మమత.. ఆసిఫాబాద్‌కు చెందిన బొల్లం పావని అనే ఇద్దరు 9 నెలలు నిండిన గర్భిణీలు ఆసుపత్రిలో ప్రసూతి కోసం వచ్చారు. మంగళవారం రాత్రి ఇద్దరు ఒకరి తరువాత ఒకరు కొద్దిపాటి సమయంలోనే పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. అయితే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఒకరి బిడ్డ మరోకరికి వచ్చిందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆసుపత్రిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని విచారణ చేపట్టారు. సఖీ సిబ్బంది అక్కడకు చేరుకొని వైద్యులతో వివరాలు సేకరించారు. ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులను సముదాయించినా వినకపోవడం.. ఆసుపత్రిలో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.
"మా మేనబావకు బాబు పుట్టిండని డాక్టర్ పిల్వంగనే పోయినం. మేడం, సిస్టర్ వాళ్లు పిలిస్తే పోయినం. బాబు పుట్టిండని స్టిక్కర్ ఇచ్చిర్రు. వెంటనే స్టిక్కర్ ఫొటో తీసుకొని మా ఆశా వర్కర్ కు పంపినం. ఆశా వర్కర్ పెట్టమన్నదంటే పెట్టినం. ఆ తర్వాత బాబు దగ్గర నుంచి కిందకు వచ్చేసినం. ఆ తర్వాత స్టిక్కర్ చింపేసుకొని బాబుని తీస్కపోయిర్రు. మళ్లా అద్దగంటకు వచ్చి మీకు పాప పుట్టిందని చెప్పిర్రు." - బాధితుడు
చివరకు బాధిత తల్లి తనకు ఆడ శిశువే జన్మించింది అని చెప్పినా నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారంటూ ప్రశ్నించారు. చివరన.. వైద్యురాలిని వివరణ కోరగా సిబ్బందికి వివరాలు తెలిపి సరిగ్గానే శిశువును ఇచ్చి పంపించానని, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. ఈ విషయమై ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి హరిశ్చంద్రారెడ్డి డీఎన్ఏ పరీక్షతో నిర్ధారణ చేసి పిల్లలను అప్పగించడం జరుగుతుందన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)