Lumpy Skin Disease Cases: కరీంనగర్ లోనూ విస్తరిస్తున్న లంపి స్కిన్ వ్యాధి, ఆందోళనలో రైతులు!
Lumpy Skin Disease Cases: కరీంనగర్ జిల్లాలో రోజురోజుకూ లంపి స్కిన్ వ్యాధి కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 3, 930 పశువులకు ఈ వ్యాధి సోకినట్లు వైద్యాధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
Lumpy Skin Disease Cases: కరీంనగర్ జిల్లాలో రోజురోజుకూ వ్యాపిస్తున్న లంపి స్కిన్ వ్యాధి రైతుల్లో ఆందోళనను కల్గజేస్తోంది. అధికారికంగా 23 పశువులు మాత్రమే మరణించినట్లు పశు వైద్య అధికారులు చెబుతున్నా, మరణాలు పదుల సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో దాదాపు 90 వేల పశువులు ఉండగా.. అందులో 6,930 పశువులకు ఈ వ్యాధి సోకినట్లు వైద్యాధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వాటి నామునాలను కూడా సేకరించారు. అయితే వీటిలో తీవ్రత ఎక్కువగా ఉన్న 17 పశువులకు సంబంధించిన రక్త నమూనాలు, గాయం పక్కులను హైదరాబాదులో ఉన్న వెటర్నరీ బయలాజికల్ రీసెర్చ్ ఇన్స్ ట్టిట్యూట్ కు పంపించారు. పంపిన నమూనాల్లో పాజిటివ్ గా నిర్ధారణ కాని వాటిని అక్కడి నుంచి పంపించారని సమాచారం.
జిల్లాలో ఇప్పటి వరకు 12,822 పశువులకు వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు తెలిపారు. వ్యాధి సోకినట్లు తేలిన చోట నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని పశువులకు వ్యాక్సినేషన్ ఇస్తున్నట్టు, ఇంకా 22 వేల డోసుల వ్యాక్సిన్ ఉన్నట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు. వ్యాధి నివారణలో భాగంగా అనుమానిత పశువులకు సత్వర వైద్యం అందించేలా జిల్లా వ్యాప్తంగా చర్యలు చేపట్టారు. కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గాల్లో ఉన్న సంచార పశు వైద్య శాలలను వినియోగిస్తున్నారు. అవసరమైన వారు 1962 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయగానే సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. అలాగే హుజరాబాద్ లో ఉన్న పశు వైద్యశాలతో పాటు జిల్లాలోని 24 ప్రాథమిక, 37 సబ్ సెంటర్లలో లంపి స్కిన్ వ్యాధి కి చికిత్స అందిస్తున్నారు. 36 మంది గోపాల మిత్ర, 24 మంది పరిమితులను కూడా అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి పూర్తిగా నిలిపివేశారు. జిల్లా సరిహద్దుల్లో పశువుల రవాణాతో కనిపిస్తే 15 రోజుల పాటు పశువులను క్వారంటైన్ లో ఉంచి చర్యలు చేపట్టారు.
వ్యాధి సోకిన పశువుల్లో కనిపించే లక్షణాలివే..
వ్యాధి సోకిన పశువులకు 104 డిగ్రీల ఫారెన్ హీట్ జ్వరం వస్తుంది. నాసిక, కండ్లు, నోటి నుంచి స్రావాలు వస్తుంటాయి. చర్మం మీద 5 మిల్లీ మీటర్ల స్థాయిలో కంతులు ఏర్పడతాయి. కాళ్లు, గంగడోలు వాపు వస్తాయి. పశువులు పడుకోవడానికి ఇబ్బంది పెడతాయి. చూడి పశువులకు గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. తెల్ల పశువుల్లో వ్యాధి ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. 4 రోజుల నుంచి 14 రోజుల వరకు ప్రభావం అధికంగా ఉంటుందని... ఈ సమయంలోనే ఈ వ్యాధి ఇతర పశువులకు వ్యాప్తి చెందే అవకాశం చాలా ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పశువులు పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఇప్పటి వరకు ఉన్న వ్యాధి తీవ్రతను బట్టి 1 నుంచి 2 శాతం వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది..
పశువులపై వాలి రక్తాన్ని పీల్చే పరాన్నజీవులను గోమార్లు, పిడుగులు, జోర్రీగలు, దోమల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా కీటకాలు ఎక్కువగా ఉండే జూలై నుంచి అక్టోబర్ వరకు వ్యాధి వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వ్యాధి సోకినట్లు అనుమానం రాగానే ఆరోగ్యకరమైన పశువులకు వీలైనంత దూరంగా పెట్టాలి. పశువుల పాకల వద్ద బూటాక్స్ లాంటి క్రిమిసంహారక మందు పిచికారీ చేయాలి. సాయంత్రం వేపాకు పొగ వెయ్యాలి. అవకాశం ఉన్నవారు దోమ తెరలు ఉపయోగించాలి. పశు వైద్యుల సూచనల మేరకు యాంటీ ఇనఫ్లమేటరీ, చాటక్స్ మందులను ఏడు రోజుల పాటు వాడాలి. వ్యాధి సోకిన పశువులకు ఆయింట్మెంట్, వేపాకు, సీతాఫలం ఆకు పసుపు కలిపి రాస్తే మంచి ఫలితం ఉండి వ్యాధి తగ్గుముఖం పడుతుంది.