Jagtial News: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య- జగిత్యాల జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత
Congress MLC Jeevan Reddy: జగిత్యాల జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత తలెత్తింది. ఓ కాంగ్రెస్ లీడర్ హత్య సంచలనంగా మారుతోంది. దీనిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్నా చేస్తున్నారు.
Congress MLC Jeevan Redd protest Against Follower murdered: జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురయ్యారు. ఉదయం మార్నింగ్ వాక్ చేసి తిరిగి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతున్న సమయంలో హత్య చేశారు. ఆయన వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి కారుతో ఢీ కొట్టి విచక్షణరహితంగా కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని చూసిన కొంతమంది గ్రామస్తులు వెంటనే గంగారెడ్డిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అలా తరలిస్తున్న టైంలో దారిలోనే గంగారెడ్డి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
హత్య వెనుక ఉన్నది ఎవరు?
జగిత్యాల జిల్లా జాబితాపూర్‌కు చెందిన గంగారెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు. మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి హత్యకు నిరసనగా జగిత్యాల జిల్లాలో నిరసన చేపట్టారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మాజీ ఎంపిటిసి గంగారెడ్డి హత్యకు కారణం గ్రామానికి చెందిన బత్తిని సంతోష్ గౌడ్ అనే వ్యక్తి అని ఆరోపిస్తున్నారు. గతంలో కూడా గంగారెడ్డిని పలుమార్లు చంపుతానని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జీవన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇది ముమ్మాటికి రాజకీయ హత్యలే పాత కక్షలతో గంగారెడ్డిని హత్య చేయించారని జీవన్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లాలో జరిగిన హత్యకు నిరసనగా జీవన్‌రెడ్డికి మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున అనుచరులు తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపడుతున్నారు జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ధర్మపురి ఎమ్మెల్యే వడ్లూరి లక్ష్మణ్ ఆందోళనలో పాల్గొన్నారు.
హత్యకి పోలీసుల నిర్లక్ష్యమే కారణం...
జగిత్యాల రూరల్ ఎస్సైగా ఉన్న ఓ పోలీస్ అధికారికి నిందితుడు బత్తిని సంతోష్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. గతంలో మాజీ ఎంపిటిసి గంగారెడ్డి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ముమ్మాటికి ఈ హత్యకి కారణం పోలీసుల నిర్లక్ష్యమేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.