గన్నులతో తిరుగుతున్న సిలిండర్ దొంగలు - అసలు కారణం తెలిసి పోలీసులు షాక్!
కరీంనగర్ రూరల్ మండలం నగునూరుకు చెందిన బత్తిని తిరుపతి అనే వ్యక్తి మానకొండూరు మండలంలోని సమృద్ధి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో పని చేసేవాడు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తరచూ తుపాకులతో సంచరిస్తూ నేరగాలు పోలీసులకు సవాల్ విసిరుతున్నారు. చిన్నచిన్న కారణాలకే ఏకంగా మారణాయుధాలను వాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జాబ్‌లోనుండి తొలగించారని కోపంతో ఓ వ్యక్తి ఏకంగా యజమానులను హతమార్చడానికి తుపాకులను కొనుగోలు చేసి మరీ సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో తుపాకుల వాడకం జిల్లాలు మరోసారి చర్చనీయాంశమైంది.
ఏం జరిగింది?
కరీంనగర్ రూరల్ మండలం నగునూరుకు చెందిన బత్తిని తిరుపతి అనే వ్యక్తి మానకొండూరు మండలంలోని సమృద్ధి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో పని చేసేవాడు. సరిగా ఉద్యోగం చేయడం లేదని చెప్పి ఏజెన్సీ నిర్వాహకులు అతన్ని పని నుంచి తీసివేశారు. దీంతో యజానిపై కక్ష పెంచుకున్నాడు తిరుపతి.
ఎలాగైనా యజమానిపై పగ సాధించాలనుకొని వేములవాడకు చెందిన కటుకూరి రాజశేఖర్‌తో కలిసి గోదాంలో నిల్వ ఉంచిన 281 సిలిండర్లను గతంలో చోరీ చేశాడు. ఇక అక్కడితో ఆగకుండా యజమానులను హతమార్చాలనే వ్యూహానికి తెరలేపారు. ఉత్తరప్రదేశ్ లగడా అనే వ్యక్తిని కలిసి రెండు తుపాకులను కొనుగోలు చేశారు. సిలిండర్ దొంగల కోసం వెతుకుతున్న పోలీసులు ఆదివారం రోజున ఈదులగట్టపల్లి శివారులో తిరుపతి, రాజశేఖర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద 160 సిలిండర్లతో పాటు రెండు దేశీయ తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.
సిలిండర్ చోరీకి అసలు కారణాలపై ఆరా తీసిన పోలీసులకు హత్య కుట్ర కూడా వెలుగు చూసింది. ఉద్యోగం నుంచి తొలగించాలని చిన్న కారణంతో హత్యకు ప్లాన్ చేశాడని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు.
గన్స్‌తో హల్ చల్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అక్రమ ఆయుధాల వినియోగం తరచూ తెరమీదకి వస్తోంది. ఏడాది కిందట కరీంనగర్ కి చెందిన ఓ యువకుడు దిగిన ఫోటో సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. దీంతో ఈ వ్యవహారాన్ని గుర్తించిన పోలీసులు అతని అదుపులోకి తీసుకొని ఆయుధాన్ని స్వాధీన పరుచుకున్నారు .కేసు నమోదు చేసి జైలుకు పంపారు.
గత నెలలో కొనరావుపేట మండలం బావుసాయి పేటలో తండ్రి కొడుకులు మధ్య వివాదంలో ఇంట్లో దాచిన గన్ను వ్యవహారం బయటికి వచ్చింది. తపంచాతో పాటు బుల్లెట్లున్నట్టు గుర్తించిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకొని స్వాధీనం చేసుకున్నారు .
ఏడాదిన్నర కిందట తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో భార్యపై భర్త కాల్పులు జరిపాడు. నేపాల్ లో గతంలో పనిచేసిన అతను తనకు దొరికిన తుపాకీ ఇంట్లో దాచి ఇంటి గొడవ విషయంలో ఏకంగా భార్యపైనే ఆయుధాన్ని ప్రయోగించాడు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో ఆ సంఘటనలో అతని భార్య ప్రాణాలు దక్కించుకుంది.
ఈమధ్య హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం తన నియోజకవర్గ పరిధిలో అక్రమ ఆయుథాల వినియోగం పెరిగిందని ప్రకటించడం సంచలం సృష్టించింది .దీంతో కరీంనగర్ సిపి సత్యనారాయణ వివరణ ఇస్తూ అలాంటిదేమీ లేదంటూ వివాదానికి తెరదించారు.
తెస్తున్నారిలా...
జిల్లాలో లైసెన్స్ ఆయుధాలను వాడుతున్న వారు నూట మూడు మంది ఉన్నారు. అయితే సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్రతో పాటు ఇక్కడికి పని కోసం వస్తున్న ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారి ద్వారా నేరస్తులు కొత్తగా నేరాలకు పాల్పడేవారు తుపాకీ కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారు. దేశీ తుపాకులు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అతి తక్కువ ధరకే దొరకడంతో అక్రమంగా వీటిని కొనుగోలు చేసి వివిధ మార్గాల ద్వారా తెచ్చుకుంటున్నారు. చిన్న చిన్న సంఘటనల్లోనే వీటిని వినియోగిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
రియల్ ఎస్టేట్ దందాల్లో ప్రత్యర్ధుల నుంచి ప్రాణభయం ఉండడంతో కొందరు అక్రమంగా ఆయుధాలను తమ వద్ద ఉంచుకున్నట్టు తెలుస్తోంది. గతంలో కేసులు ఉంటే పోలీసులు ఆయుధాల లైసెన్స్ ఇవ్వరు కాబట్టి ఇలా అక్రమంగా వినియోగించడానికి మీరు ప్రాధాన్యతిస్తున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి పోలీసులు ఏకకాలంలో అనుమానితులపై దాడి చేస్తే అక్రమ ఆయుధాల గుట్టు బయటపడే అవకాశం ఉంది.