Karimnagar: అమ్మ లేదు, నాన్న లేడు - ఏడాదిలో తల్లితండ్రుల మరణంతో చిన్నారులకు దిక్కెవరు?
Telangana News | పిల్లల బాగోగులు తల్లిదండ్రులు చూసుకుంటారు. ఒక సంవత్సరం వ్యవధిలో తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లల కష్టాలు రెట్టింపయ్యాయి. తాతయ్య, నానమ్మల ఆరోగ్యం బాగుండదు.
Karimnagar News | తల్లిదండ్రులు ఒక్క పూట కనిపించకపోతేనే బిక్కుబిక్కుమంటూ చూస్తుంటారు చిన్నారులు. మారిన హైటెక్ యుగంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమ పిల్లలను బేబీ కేర్ సెంటర్లలో విడిచిపెట్టి వెళ్తుంటారు. చిన్నారులు ఉండే ఆ కొద్దిసేపు సమయంలోనే తల్లి కనిపించకపోవడంతో బెంగతో తల్లడిల్లుతుంటారు చిన్నారులు. మరి కొంత సమయం వరకే తమ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండలేని చిన్నారులు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుంటే వారి పరిస్థితి ఏంటి...? ప్రతిరోజు నిత్యం తల్లిదండ్రుల మధ్య నవ్వుల కిలకిలలతో తల్లిదండ్రుల ఆలనా పాలనతో అమ్మ చేతి ముద్దలతో గడిపే ఆ చిన్నారుల పరిస్థితి ఎలా ఉంటుంది...? ఇలాంటి ఆలోచన వస్తేనే మనస్సు కళుక్కుమంటోంది.
చిన్నతనంలో తండ్రి చనిపోతే, తల్లి ఆలనా పాలన చూసుకుంటుంది అలాగే తల్లి మరణిస్తే తండ్రి చూసుకుంటారు. కానీ ఒక సంవత్సరం వ్యవధిలో తండ్రి, మరికొన్ని రోజులకు తల్లి మరణిస్తే వారి పరిస్థితి ఏంటి ? అయితే ఇలాంటి ఘటనలు కొంతమంది జీవితాలలో విషాదాన్ని నింపుతున్నాయి. ఇలాంటి ఘటన కరీంనగర్ జిల్లాలో ఓ చిన్నారుల చోటుచేసుకుంది.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రానికి చెందిన పవన్ కళ్యాణ్ శ్రీహర్ష అనే యువతితో ప్రేమలో పడ్డారు. మనసులు కలవడంతో వివాహ బంధంతో ఒకటయ్యారు. పవన్ కళ్యాణ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ వారి కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరిద్దరికీ ఓ కుమార్తె కుమారుడు సంతానం. అయితే ఎంతో అన్యోన్యంగా సాఫీగా సాగుతున్న వీరి జీవితం ఒక్కసారిగా ముక్కలైంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పవన్ కళ్యాణ్ మనస్థాపానికి గురై ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అత్తమామలు వికలాంగులు కావడంతో వారు కూడా ఎలాంటి పనిచేయలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ భార్య కుటుంబ పోషణకై తన ఇద్దరు పిల్లలతోపాటు తన అత్తమామను కూడా చూసుకునేందుకు ఓ ప్రైవేటు షోరూంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తోంది.
ఒకరోజు ఏమైందో ఏమో కానీ హఠాత్తుగా బావిలో శవమై తేలింది. ఇప్పటికే కొడుకుని పోగొట్టుకొని సంవత్సరం గడవకముందే తమ బాగోగులు చూసుకునే కోడలు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కుటుంబం మరింత విషాదంలో మునిగిపోయింది. ఓవైపు అభం శుభం ఎరుగని ఇద్దరు చిన్నారులు.. మరోవైపు వీరి బాగోగులు చూడాల్సిన తాతయ్య, నానమ్మలు కూడా కదలలేని పరిస్థితిలో ఉన్నారు. వీరి జీవితం ఎలా సాగుతుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది.
మృతురాలి అత్తయ్య ఆవేదన..
ఓ వైపు కుమారుడు చనిపోయి ఏడాదైనా గడవకముందే ఆ దుఃఖాన్ని దిగమింగే లోపే తమ కోడలు శవమై కనిపించడంతో వారి కష్టాలు రెట్టింపయ్యాయి. తమ కుమారుడి మరణం తరువాత తమ కోడలు తమను, తన పిల్లలలాగ చూసుకుందని చెప్పింది. కొడుకు, కోడలు ఇద్దరు లేకపోవడంతో దుఃఖాన్ని దిగమిగలేక పోతున్నారు.