రామగుండంలో అమ్మకానికి ఆసుపత్రి ఉద్యోగాలు, మామూలుగా ఉండదు మరి!
డబ్బులు ఇస్తే ప్రభుత్వాస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తూ.. ఓ వ్యక్తి ఒక్కొక్కరి వద్ద లక్ష నుంచి మూడు లక్షల వరకు దోచేస్తున్నాడు. ఆస్పత్రితో సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తున్నాడు.
ఇప్పటికే ఉద్యోగాల పేరుతో రామగుండంలో జరిగిన తంతు అంతా ఇంతా కాదు. దళారులు టెంపరరీ ఉద్యోగాలకు కూడా వెల కడుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారు. ఎప్పటి వరకు ఉంటుందో, ఊడుతుందో తెలియని ఉద్యోగాలకు అనవసర హైప్ పెంచుతూ లక్షలు దండుకుంటున్నారు. నెల జీతం 25 వేలకు పైగా ఉంటుంది, శాశ్వత ఉద్యోగులతో సమానంగా సదుపాయాలు, కార్మికులను తొలగించే ప్రసక్తే ఉండదని చెబుతూ.. కొందరు దళారులు రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు. వీరు చెప్పే మాటలు విన్న నిరుద్యోగులు ఎన్ని డబ్బులు చెల్లించేందుకు అయినా వెనుకాడటం లేదు. అయితే తాజాగా గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనీక ఆస్పత్రిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
ఒక్కొక్కరి వద్ద లక్ష నుంచి మూడు లక్షల వరకు...
ఆస్పత్రిలో పారిశుద్ధ్య, పేషెంట్ కేర్, సెక్యూరిటీ విభాగాల్లో ఉద్యోగాలు అంటూ, ఒక్కొక్కరి వద్ద లక్ష నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నారట. అయితే ఆసుపత్రితో ఏ మాత్రం సంబంధం లేని ఒక వ్యక్తే ఇలా చేసినట్లు టాక్. డబ్బు ఎవరికీ చెల్లించకుండా కొందరు ప్రజా ప్రతినిధుల సిఫార్సులతో ఆస్పత్రిలో విధుల్లో చేరిన పారిశుద్ధ్య కార్మికులపై ఒత్తిడి పెంచుతూ.. తమకు తామే వెళ్ళి పోయేలా ఆ వ్యక్తి ఇబ్బందులకు గురి చేస్తున్నారట. ఆ తర్వాత వారి స్థానంలో కొత్త వారిని నియమించుకుంటున్నారట. ఇటీవల ఓ ఇద్దరు మహిళా కార్మికులతో వారం, పది రోజులు పని చేయించుకుని వారి ప్రవర్తన బాగాలేదని చెప్పి తొలగించారని చెబుతున్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య, రక్షణ, పేషెంట్ కేర్, కార్మికులను కలుపుకుని మొత్తం 120 మంది పని చేస్తున్నప్పటికీ.. ఇంకా మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆ ఓ వ్యక్తి చెబుతున్నారు. డబ్బులు ఇస్తే పనిలో పెట్టిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు సమాచారం.
నచ్చిన వారికి నచ్చిన షిఫ్టులు..
ఆసుపత్రిలోని ఆచార్యులు, వైద్యులు, వైద్య సిబ్బంది సైతం ఏదైనా సమస్య ఉంటే నేరుగా చెప్పుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని సిబ్బంది చెబుతున్న మాట. సిబ్బంది విధులకు సంబంధించిన రోస్టర్ సైతం ఆ వ్యక్తే తయారు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.. హాజరు పట్టికలో ఒక రోజు ఉన్నవారి పేరు మరుసటి రోజు ఉండడం లేదని ఆరోపణలు ఉన్నాయి. డ్యూటీ రోస్టర్ వారానికి ఒకసారి మారాల్సి ఉండగా... గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో మాత్రం రోజురోజుకూ మారిపోతుందట. రొటేషన్ విధానానికి విరుద్ధంగా నచ్చిన వారికి సులభమైన పనులను కేటాయించి రెండు నెలల పాటు అక్కడే పని చేసేలా చేస్తున్నారని ఓ విమర్శ ఉంది. కొత్తగా విధుల్లో చేరిన సెక్యూరిటీ సిబ్బందికి ఆస్పత్రి లోపల విధులు కేటాయిస్తుండగా, దశాబ్ద కాలంగా పని చేస్తున్న వారికి నెలల తరబడి అక్కడే పని చేపిస్తున్నారని మరో ఆరోపణ.
బాలింతల విభాగంలో పురుషులకు విధులు..
కొత్తగా విధుల్లో చేరిన సూపర్ వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది, పేషెంట్ల బంధువులపై దురుసుగా మాట్లాడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆస్పత్రి నుంచి తమకు సంబంధించిన మహిళను తీసుకెళ్లేందుకు ఓ వ్యక్తి కారులో వచ్చాడు. ప్రధాన ద్వారం వద్ద కారు నిలిపినందుకు సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలో గొడవ జరిగింది. బాలింతల వార్డులో మహిళా పారిశుద్ధ్య కార్మికులకు విధులు కేటాయించాల్సి ఉండగా, పురుషులకు విధులు కేటాయించడంపై సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే షాడో సూపరిండెంట్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నారని కార్మికులు చెబుతున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు.