Bandi Sanjay: యాగంలో నీ బిడ్డతో ప్రమాణం చేయించు, లేదంటే నీ కుట్రలు నీకే తిప్పికొడతాయి - బండి సంజయ్
జగిత్యాలలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. యాగం సమయంలో లిక్కర్ కేసులో కుమార్తె కవిత పాత్ర లేదని ప్రమాణం చేయాలని సవాలు విసిరారు.
ఎన్ని యాగాలు చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలను దేవుడు కూడా క్షమించబోడని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ తప్పులను తెలంగాణ సమాజం గ్రహిస్తుందని అన్నారు. కేసీఆర్ రాజశ్యామల యాగం చేసినా ఫలితం ఉండబోదని, దేవుడు ఆయన్ని కాపాడలేడని అన్నారు. దన్నారు. ఢిల్లీలో చేయనున్న రాజశ్యామల యాగం సమయంలో లిక్కర్ కేసులో కుమార్తె కవిత పాత్ర లేదని ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. బిడ్డ ఏమైనా సింహామా లేక పులా అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. జగిత్యాలలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అలా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో పేదలు అరిగోస పడుతున్నారని అన్నారు. పేదలను గోస పెడుతున్న కేసీఆర్ ఏ యాగం చేసినా ఫలించబోదని అన్నారు. కేసీఆర్ ఢిల్లీలో రాజశ్యామల యాగం చేయడాన్ని తాము వ్యతిరేకించడం లేదని అన్నారు. అయితే కేసీఆర్ స్వార్దం కోసం యాగం చేసుకుంటున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని నెరవేర్చారో రాజశ్యామల యాగం చేసేటప్పుడు ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ‘‘యాగం చేసేటప్పుడు ముందు మైక్ పెట్టుకుని తెలంగాణలో ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చారో, నిరుద్యోగ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో, ఎంత మందికి రైతు రుణమాఫీ చేశారో, ఎంతమంది దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారు? దళిత బంధు ఎంత మందికి ఇచ్చారు? ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక పోవడానికి కారణమేంటో, కాళేశ్వరంలో ఎంత కమీషన్లు తీసుకున్నారో వాస్తవాలు తెలియజేయాలి’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేకపోతే కేసీఆర్ చేసే యాగాలు ఆయనకే చెడు చేస్తాయని అన్నారు.