Bandi Sanjay: క్యాన్సర్ కన్నా కేసీఆరే డేంజర్, మూడోసారి వస్తే థర్డ్ స్టేజ్ క్యాన్సరే - బండి సంజయ్
క్యాన్సర్ కంటే ముఖ్యమంత్రి కేసీఆరే డేంజర్ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. క్యాన్సర్ మూడో దశకు చేరితే ఎంత డేంజరో.. కేసీఆర్ మూడోసారి సీఎం అయితే అంతకంటే పెద్ద డేంజర్ అని పోల్చారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల దండుపాళ్యం ముఠా జాబితాను ప్రకటించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ బూత్ మేళా కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఆయనతో పాటుగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి కూడా ఆయన వెంట ఉన్నారు. తొలుత వారు చాకలి ఐలమ్మ, సర్దార్ పాపన్న, దొడ్డి కొమురయ్య, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు.
అనంతరం సభలో మాట్లాడారు. జితేందర్ రెడ్డిది లక్కీ హ్యాండ్ అని.. చేవేళ్లలో బీజేపీ తప్పకుండా గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దళితబంధు పేరుతో 30 శాతం కమీషన్ తీసుకుంటూ ఎస్సీల పొట్ట కొడుతున్న మూర్ఖుడు కేసీఆర్ అని తీవ్ర ఆరోపణలు చేశారు.
క్యాన్సర్ కంటే ముఖ్యమంత్రి కేసీఆరే డేంజర్ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. క్యాన్సర్ మూడో దశకు చేరితే ఎంత డేంజరో.. కేసీఆర్ మూడోసారి సీఎం అయితే అంతకంటే పెద్ద డేంజర్ అని పోల్చారు. ప్రజల్ని నట్టేట ముంచిన బీఆర్ఎస్‌కు ఓటేస్తారా? అని అడిగారు. ఉద్యమాలు చేస్తూ జైలుకు వెళ్లి వస్తున్న బీజేపీ నేతలకు ఓటు వేయాలని కోరారు. తెలంగాణలో రామరాజ్యం తేవడమే తమ లక్ష్యమని అన్నారు. సీఎం కేసీఆర్ ది దంతా పెగ్గుల భాగోతమే అని, సీఎంగా కేసీఆర్ ఒరగబెట్టింది ఏమీ లేదని అన్నారు.
దళితులంటే కేసీఆర్ కు చిన్నచూపు
ముఖ్యమంత్రి అసలు ఎస్సీ నియోజకవర్గాల్లో ఓట్లు అడిగేందుకు అనర్హుడని కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడారు. దళితులకే కాకుండా ఏ ఒక్క సామాన్యుడికి, పేదవాడికి కూడా కేసీఆర్ చేసింది ఏమీ లేదని అన్నారు. యువరాజుకి, యువరాణికి మాత్రం కోట్ల రూపాయల భూముల్ని అప్పచెప్తున్నాడని ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రజల పొట్టకొడుతూ, ఆయన ఇంట్లోని ఖజానా నింపుకుంటున్నాడని ఆరోపణలు చేశారు.
మరో బీజేపీ నేత జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీలు లేదా దళితులపై జితేందర్ రెడ్డికి ఇప్పటికీ చున్నచూపుగానే ఉందని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా.. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా.. దళితబంధు ఇస్తా అంటూ ఎన్నో మాయమాటలు చెబుతూ కేసీఆర్ ఇప్పటికే వారికి తీరని అన్యాయం చేశారని అన్నారు.