Bandi Sanjay: బెంగళూరు డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హస్తం: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు డ్రగ్స్ కేసులో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాత్ర ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
'బెంగళూరు డ్రగ్స్ కేసు' పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. డ్రగ్స్ కేసులో కర్ణాటక ప్రభుత్వం గతంలోనే రోహిత్ రెడ్డికి నోటీసులు వచ్చాయన్నారు. బెంగళూరు వెళ్ళిన బీజేపీ లీగల్ టీం, అక్కడ అధికారులను డ్రగ్స్ కేస్ కు సంబంధించిన వివరాలను అడిగితే అందులోని ఒక అధికారి నేరుగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు సమాచారం అందించి అలర్ట్ అయ్యేలా చేశాడని చెప్పారు. బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను రీఓపెన్ చేయిస్తున్నాం అన్నారు. తమ లీగల్ టీం ఇప్పటికే ఆ పనిలో నిమగ్నమై ఉందన్నారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో రోహిత్ రెడ్డిని తీసుకెళ్లి హడావుడిగా స్టేట్ మేంట్ రికార్డ్ చేయించారని బండి సంజయ్ విమర్శించారు. ఇందులో ఎవరి పాత్ర ఉందో త్వరలోనే బయట పడుతుందన్నారు. ఓ హీరోయిన్ తో కలిసి, విదేశాల్లో డ్రగ్స్ తీసుకున్న నేత పేరు కూడా త్వరలోనే బయటికి వస్తుందన్నారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డితోపాటు ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, హీరోయిన్లు ఉన్నారనేది త్వరలోనే తేల్చుతామన్నారు. ఇందులో నిజనిజాలు బయటకు రావాలంటే బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసును రీఓపెన్ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. కానీ బెంగళూరు డ్రగ్స్ కేసులో బిజెపి లీగల్ టీం ఎంక్వయిరీ చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సమాచారం అందిందని, అందుకే హడావిడిగా ఆయనతో ఎమ్మెల్యేలక ఎర కేసులో స్టేట్ మెంట్ రికార్డ్ చేశారని ఆరోపించారు.
Live : Day 16 of #PrajaSangramaYatra5 https://t.co/gp9oWmjvQl
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 13, 2022
కల్వకుంట్ల అవినీతికి జేజేలు కొడితే మానవహక్కులున్నట్లా?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో మానవ హక్కులను హరిస్తుందని కేసీఆర్ బిడ్డ, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఎంపీ బండి సంజయ్ కుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు. మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత కవితకు లేదన్నారు. మానవ హక్కులను హరించి వేస్తోంది కేసీఆర్ అన్నారు. ప్రశ్నించే వాళ్లే ఉండకూడదని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ను ఎత్తేశారమన్నారు. ప్రశ్నించే వాళ్లపై కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. నిజాలు రాసే మీడియాను తొక్కివేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే కవులు, కళాకారులు, మేధావులను బెదిరిస్తున్నారన్నారు. బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్నే కేసీఆర్ తిరిగ రాస్తానన్నారని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న అరాచకాలకు, అవినీతికి జేజేలు కొడితేనే మానవ హక్కులున్నట్లా? అంటూ ఎద్దేవా చేశారు. మీడియాను బీజేపీ అణిచివేస్తోందంటూ కవిత చేసిన వ్యాఖ్యలపైనా బండి సంజయ్ మండిపడ్డారు.
మానవ హక్కులను కాలరాస్తోందే కేసీఆర్ అంటూ విమర్శలు చేశారు. అత్యాచారాలు, హత్యలు, దోపిడీ జరుగుతుంటే కవిత కళ్లలో నుంచి నిప్పులెందుకు రాలేదని ప్రశ్నించారు. కనీసం బాధితులను పరామర్శించాలనే సోయి ఎందుకు రాలేదన్నారు. కవితను అరెస్ట్ చేస్తారనే సరికి మహిళలంతా కన్నీళ్లు, నిప్పులు కురిపించాలా? అంటూ ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, పెన్షన్, ఆర్థిక సాయం చేస్తానన్న హామీలు ఏమయ్యాయన్నారు. కొండగట్టు ప్రమాద బాధితులకు ఇప్పటి వరకూ సాయం అందలేదని ఆరోపించారు. బస్సులో ప్రయాణించడమే వాళ్లు చేసిన పాపమా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ ప్రమాద బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించలేదన్నారు.