Karimnagar Cable Bridge : కరీంనగర్ వాసులకు గుడ్ న్యూస్, త్వరలో అందుబాటులోకి కేబుల్ బ్రిడ్జి!
Karimnagar Cable Bridge :కరీంనగర్ నగరాన్ని తెలంగాణకు తలమానికంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. డిసెంబర్ 31 నాటికి కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి తెస్తామన్నారు.

Karimnagar Cable Bridge : కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను డిసెంబర్ 31 లోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. శనివారం టూరిజం శాఖ ఎండీ, ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ, ఎస్ఆర్ఎస్సీఈ, నగర మేయర్, జిల్లా కలెక్టర్లతో కలిసి కేబుల్ బ్రిడ్జి నిర్మాణ, అప్రోచ్ రోడ్డు పనులు, మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. మానేరు రివర్ ఫ్రంట్ కు సంబంధించిన మ్యాప్ లు పరిశీలించారు. థీమ్ పార్క్ లు, ఫౌంటెన్ ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. పనులను మరింత వేగవంతంగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత కరీంనగర్ ను గొప్పగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కరీంనగర్ నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణాలను చేపట్టామన్నారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం అప్రోచ్ రోడ్ లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. డిసెంబర్ 31 లోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో
తెలంగాణకి తలమానికంగా నిలిచే విధంగా, కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే ఎంఆర్ఎఫ్ కు సంబంధించిన గోడ పనులు జోరుగా సాగుతున్నాయని మరోవైపు నది మధ్యలో లెవెలింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. మొదటి దశలో4 కిలోమీటర్ల మేర నిర్మించాలనే ప్రణాళికలు సిద్ధం చేయగా ఇప్పటికే రెండు కిలోమీటర్ల మేర గోడ పనులు పూర్తయ్యాయని చెప్పారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులను డిసెంబర్ 2023 లోగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కరీంనగర్ ను ఆనుకొని 24 టీఎంసీల వాటర్ బాడి ఉండడం కరీంనగర్ నగరం చేసుకున్న ఆదృష్టమన్నారు. ఎల్ఎండీ పై గుజరాత్ లోని సబర్మతి రివర్ ఫ్రంట్ తరహా మరింత ఆధునికమైన థీమ్ పార్కులతో మానేరు రివర్ ఫ్రంట్ ను నిర్మిస్తున్నామన్నారు. ఎమ్మారెఫ్ నిర్మాణాన్ని 2023 డిసెంబర్ లోగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామన్నారు. కరీంనగర్ వాసులు విహార యాత్ర పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారే ఇక్కడికి వచ్చేలా నగరాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇటు ఇరిగేషన్... అటు పర్యాటక శాఖల సమన్వయంతో పనులను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వరదలను దృష్టిలో పెట్టుకుని పనులు
ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీదర్ రావు మాట్లాడుతూ నెల నెల పనుల్లో ఇంప్రూవ్ మెంట్ కనిపిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో ఎలాంటి అంతరాయం లేకుండా పనులు కొనసాగుతున్నాయన్నారు. వరదలను దృష్టిలో పెట్టుకుని పనులను కొనసాగిస్తున్నామని తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ ను ఆకాశమే హద్దుగా తీర్చిదిద్దుతామన్నారు. ఎమ్మారెఫ్ అందుబాటులోకి వస్తే ఇక్కడి వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పర్యాటక శాఖ ఎండీ మనోహర్ మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టుతో ఎల్ఎండీ ఎప్పుడు నిండుకుండలా ఉంటుందని, ఎల్ఎండీని బ్యూటీఫికేషన్ కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంఆర్ఎఫ్ లో భాగంగా ఇప్పటికే ఫౌంటెన్ల కోసం టెండర్లు కూడా పూర్తి చేశామన్నారు. కరీంనగర్ ను గొప్పగా నగరంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో మంత్రి పనిచేస్తున్నారని చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

