Bandi Sanjay : పన్ను ఇరిగితే 326 సెక్షన్ పెడతారా? బీజేపీ కార్యకర్తలను కొట్టిన ఏ పోలీసును వదిలిపెట్టం - బండి సంజయ్
Bandi Sanjay : బీజేపీ కార్యకర్తలపై దాడి చేసి తిరిగి వాళ్లపైనే కేసులు పెట్టారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ కార్యకర్తలను కొట్టిన ఏ పోలీసు అధికారిని వదిలిపెట్టమన్నారు.
Bandi Sanjay : ఈనెల 5న బీఆర్ఎస్ నేతలు మా కార్యకర్తలపై దాడి చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కమలాపుర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా...ఈటల రాజేందర్ విజయం సాధించారని గుర్తుచేశారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే ఈటలకు ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. ఈటల కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలైతే మా కార్యకర్తలపై కేసులు పెడతారా? అని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థ ఇంతలా దిగజారిపోయిందన్నారు. పోలీసులు కేసీఆర్ మోచేతుల నీళ్లు తాగుతున్నారని ఆరోపించారు. పోలీసులకు కొట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. గుండాలకు తుపాకుల లైసెన్సులు ఇస్తారా? అని నిలదీశారు.
బీజేపీ కార్యకర్తలకు సన్మానించిన బండి సంజయ్
ఇటీవల బీఆర్ఎస్-బీజేపీ ఘర్షణలో జైలుకు వెళ్లి వచ్చిన బీజేపీ కార్యకర్తలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్మానించారు. మీడియా ముందు బాధితులతో బండి సంజయ్ మాట్లాడించారు. ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఒక్కసారి హామీ ఇస్తే వెనక్కి పోదన్నారు. పోలీస్ వ్యవస్థపై తెలంగాణలో నమ్మకం పోయిందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎక్కడ పర్యటించినా బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. మరోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే వాళ్ల కుటుంబానికి ప్రజలు బానిసల్లాగా మారాల్సి వస్తుందన్నారు. తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెడతామని మాకు లోన్ ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని బండి సంజయ్ తెలిపారు. తన సవాల్ ను స్వీకరించి దీనిపై సీఎం కేసీఆర్ చర్చకు సిద్ధమా? అన్నారు.
పన్ను ఇరిగిందని 326 కేసు పెట్టారు
"పరామర్శ కోసం ఈటల రాజేందర్ వెళ్తే బీఆర్ఎస్ గుండాలు దాడులు చేశారు. అక్కడ స్థానికులు ఆ దాడిని ఆపే ప్రయత్నం చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఏం జరిగిందో తెలంగాణ సమాజం మొత్తం చూసింది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో అందరికీ తెలుసు. ఇప్పటికీ ఎమ్మెల్యే ఈటలకు ప్రొటోకాల్ పాటించడంలేదు. అధికారులు కూడా పట్టించుకోవడంలేదు. ఈటల రాజేందర్ పరామర్శకు వెళ్తేందుకు రాడ్లు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బీజేపీ కార్తకర్తలకు గాయాలయ్యాయి. అయితే తిరిగి బీజేపీ కార్యకర్తలపైనే పోలీసులు కేసులు పెట్టారు. ఎవరికో పన్ను ఇరిగిందట, ఆ పన్ను కట్టించింది కూడా మావాడే. ఎప్పుడో పన్ను ఇరిగితే ఇప్పుడు దాడి చేసినప్పుడు పన్ను ఇరిగిందని 326 సెక్షన్ ప్రకారం కేసుపెట్టారు. అయితే ఏ ఆయుధాలు రికవరీ చేశారు. విచారణ కూడా చేయకుండా రాత్రికి రాత్రి బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. దారిలో అడ్డగించిన వాళ్లపై కేసులు పెడతారా? దాడి నుంచి ఈటల రాజేందర్ ను కాపాడుకున్న వారిపై కేసులు పెడతారా? పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిందంటే కొంత మంది పోలీసులు చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రభుత్వం పర్మినెంట్ అనుకుంటున్నారు కొందరు. ఇక్కడ సీఐ బీజేపీ కార్యకర్తలను కొట్టారంట. ఎవరిచ్చారు మీకు కొట్టే అధికారం. కొంత మంది పోలీసులు అధికారులు దారుణంగా ప్రశ్నిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను కొట్టిన ఏ పోలీసును వదిలిపెట్టం. లిస్ట్ తయారుచేస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునే ప్రసక్తిలేదన్నారు" - బండి సంజయ్