Notice To Bigg Boss Telugu: బిగ్‌బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసుల నోటీసులు
Bigg Boss Telugu Season 7: తెలుగు బిగ్‌బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు.
Jubilee Hills Police serves notices to Bigg Boss: హైదరాబాద్: తెలుగు బిగ్‌బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు (Jubilee Hills Polic) సోమవారం (డిసెంబర్ 25న) నోటీసులు జారీ చేశారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 ఫినాలే అనంతరం జరిగిన ఘర్షణకు సంబంధించి నిర్వాహకులకు పోలీసులు షాకిచ్చారు. బిగ్‌బాస్ యాజమాన్యం ఎండమోల్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సీఆర్పీసీ 41 కింద జూబ్లీహిల్స్ నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. బిగ్‌బాస్ సీజన్ 7 (Bigg Boss Telugu season 7) విజేతగా పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) ను ప్రకటించిన తరువాత.. కొంత సమయానికి అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవ జరిగడం తెలిసిందే. కొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కార్లపై దాడి చేయడంతో పాటు ఆర్టీసీ సిటీ బస్సులపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు.
బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు సంబంధించిన కేసుల్లో ఇప్పటివరకూ 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సోమవారం మరో ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సరూర్‌నగర్‌కు చెందిన అవినాష్ రెడ్డి, యూసఫ్‌గూడకు చెందిన సుధాకర్, పవన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టైన బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ రెండు రోజుల కిందట బెయిల్ పై విడుదలయ్యాడు. ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేయాలని నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసే సమయంలో షరతులు పెట్టింది. ఈ కేసులో అరెస్టైన మరికొందరు నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.