Telangana Congress: కాంగ్రెస్‌లోకి ఇంద్రకరణ్ రెడ్డి, ఎన్నికల వేళ హస్తం ఎత్తుగడ ఇదే!
Telangana News: నిర్మల్ లో మే 5న రాహుల్ గాంధీ పర్యటన, బహిరంగ సభ నేపథ్యంలో ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిసింది కానీ అంతకు ముందుగానే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Indra Karan Reddy: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ అధినేత కేసిఆర్ కు రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం లేఖ రాశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అల్లోల ఓటమి పాలయ్యారు. ఆపై ఆయన బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నారు. గత కొద్దిరోజుల క్రితం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలవడంతో నిర్మల్ డిసిసి అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావ్ అనుచర వర్గాలు అల్లోల కాంగ్రెస్ లో చేరికను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిరసనలు, ధర్నా కార్యక్రమాలు సైతం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఆయనను చేర్చుకోవద్దని ఫిర్యాదులు సైతం చేశారు.
అప్పటినుండి కొద్దిరోజులపాటు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు. బీఆర్ఎస్ కు దూరంగా ఇటు కాంగ్రెస్ లో చేరికకు దూరంగా ఉన్నట్లుండి సడన్ గా కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. నిర్మల్ లో మే 5న రాహుల్ గాంధీ పర్యటన, బహిరంగ సభ నేపథ్యంలో ఆయన చేరుతున్నట్లు తెలిసింది కానీ అంతకు ముందుగానే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాదులో మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షి ఆధ్వర్యంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అల్లోల రాకతో కాంగ్రెస్లో అసమ్మతి కొంతమేర ఉన్నప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అంతా కాంగ్రెస్ లోకే..
మొదటగా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆ తర్వాత కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, నేడు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.. వీరి రాకతో పార్టికి బలం చేకూరుతుందని భావించిన అధిష్ఠానం ఎట్టకేలకు వారిని పార్టీలోకి ఆహ్వానించింది. ఇక లోక్ సభ ఎన్నికలకు కొద్ది రోజుల సమయమే ఉన్నందున కాంగ్రెస్ పార్టీ ప్రచారం గ్రామ గ్రామాల్లో ఆయా నియోజకవర్గాల్లో బలోపేతం చేసి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పార్టీ అధిష్టానం యోచిస్తోంది. నిర్మల్ లో గట్టి పోటీ ఇచ్చేందుకు సఖ్యాతమైనటువంటి నాయకులు లేనందునే..ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
బీజెఎల్పీ నేతగా ఉన్న నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి ధీటుగా ఇంద్రకరణ్ రెడ్డిసై అని భావించి ఆయనను పార్టిలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ ఆదిలాబాద్ సీటు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందుకే నిర్మల్ లో రాహుల్ గాంధీ తో బహిరంగ సభను సైతం ఏర్పాటు చేస్తున్నారు. మే 5న రాహుల్ గాంధీ సభలో ఇంద్రకరణ్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఆ నియోజకవర్గంలో పాటు పక్కన ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఎఫెక్ట్ ఉంటుందని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది.