BRS Patancheru : పటాన్‌చెరులో బీఆర్ఎస్‌కు రెబల్ బెడద తప్పదా ? - పోటీలో ఉండేదుకు పార్టీకి నీలం మధు రాజీనామా !
పటాన్ చెరులో బీఆర్ఎస్ పార్టీకి రెబల్ ముప్పు పొంచి ఉంది. నీలం మధు పార్టీకి రాజీనామా చేసి బరిలో ఉంటానని ప్రకటించారు.
BRS Patancheru : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో బిఆర్ఎస్ పార్టీ షాక్ తగిలింది. పటాన్ చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ముదిరాజ్ వర్గానికి చెందిన నీలం మధు సోమవారం ఉదయం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం బిఆరఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కెసిఆర్ కు లేఖ పంపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల కంటే ముందుగానే నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులను బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందులో పటాన్‌చెరు టికెట్ మళ్లీ ప్రస్తుత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికే దక్కింది.
అయితే ఇందులో కొందరు అభ్యర్థుల పేర్లు మారొచ్చనే ప్రచారం కూడా జరిగింది. అదే క్రమంలో పటాన్‌చెరులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నీలం మధు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. చివరి నిమిషంలోనైన కెసిఆర్.. ఈసారి పటాన్ చెరు టికెట్ తనకు ఇస్తారమోనని వేచి చూశాడు. ఈ నేపథ్యంలో నిన్న తెలంగాణ భవన్ లో కెసిఆర్ మొదట 51 మంది అభ్యర్థులకు బిఫారమ్ లు అందజేశారు. పటాన్‌చె రు టికెట్ ను ఖరారు చేస్తూ గూడెం మహిపాల్ రెడ్డికి కెసిఆర్ బిఫారమ్ అందజేశారు. దీంతో సోమవారం బిఆర్ఎస్ పార్టీకి నీలం మధు రాజీనామా చేశారు.
ముదిరాజ్ వర్గానికి ఒక్క టిక్కెట్ కూడా బీఆర్ఎస్ పార్టీ కేటాయించకపోవడంతో పటాన్ చెరు టిక్కెట్ మారుస్తారని నీలం మధు వర్గీయులు ఆశలు పెంచుకున్నారు. అయితే మార్చలేదు. ముదిరాజ్ వర్గమంతా మధు వెంట ఉండటంతో.. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో నీలం మధు తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చిట్కుల్ గ్రామ సర్పించిగా ఉంటూ ఆయన నియోజకవర్గం మొత్తం విస్తృతంగా పరిచయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవలి కాలంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పర్యటించని విధంగా చురుగ్గా పర్యటిస్తున్నారు. పాదయాత్ర చేస్తున్నారు.
ఇటీవల యాదాద్రి వరకూ పాదయాత్ర చేసి భారీ బహిరంగసభ కూడా నిర్వహించారు. పార్టీకి కూడా రాజీనామా చేయక ముందు.. ఓ సారి ప్రగతి భవన్ నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. పార్టీ పెద్దలు మాట్లాడారో లేదో తెలియదు కానీ.. ఆయనకు మాత్రం ఎలాంటి హామీ లభించలేదని స్పష్టమయింది. చివరికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలని నిర్ణయించుకున్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అంటే పడని నేతలు నీలం మధుతో కలిసి పని చేసే అవకాశం ఉంది. ముదిరాజ్ సామాజికవర్గం అంతా.. ఆర్థిక మద్దతు ఇచ్చే అవకాశం ఉండటంతో.. ఖచ్చితంగా బరిలో ఉండాలని నీలం మధు నిర్ణయించుకున్నారు.