Jaggareddy : కాంగ్రెస్ లోనే ఆ దరిద్రం - ఢిల్లీలో జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు !
ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మరోసారి అసంతృప్త స్వరం వినిపించారు. సొంత పార్టీ నేతలపై దుష్ప్రచారం చేసే దరిద్రం కాంగ్రెస్ లోనే ఉందన్నారు.
Jaggareddy : కాంగ్రెస్ లో సొంత పార్టీ నేతలపైనే దుష్ప్రచారం చేస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో నేతలపైనే దుష్ప్రచారాలు చేసే దరిద్రం దాపురించిందన్నారు. ఇంత బతుకు బ్రతికి పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూస్తా అనుకోలేదన్నారు. పార్టీలో నాలుగేళ్ళ నుంచి తనపై ప్రచారం జరుగుతోందని... పార్టీ కోసం ఎంత చేసినా తనను ప్రశ్నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో ఎందుకు ఈ పరిస్థితి ఉందో అర్థం కావడం లేదన్నారు. మీడియా అడిగేదాంట్లో తప్పు లేదని తెలిపారు. రాహుల్ గాంధీకి అన్ని విషయాలు నిశితంగా వివరిస్తానని చెప్పుకొచ్చారు.
‘‘నేను పైరవికారుణ్ణి కాదు.. వాళ్ళు పిలిస్తేనా వచ్చా. పార్టీ ఐక్యంగా ఉందో లేదో నేను చెప్పలేను... నేను చెప్పే వాడిని కూడా కాదు.. పార్టీ ఐక్యంగా ఉందో లేదో రాహుల్ గాంధీకి చెబుతా’’ నని జగ్గారెడ్డి ఢిల్లీలో తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పార్టీ పెద్దలు రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ చర్చలు జరుపనున్నారు. ఏఐసీసీ వార్ రూమ్‌లో టీ కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్ జరుగనుంది. సమావేశానికి 21 మంది తెలంగాణ నేతలకు పిలుపు రావడంతో వారంతా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో జగ్గారెడ్డి కూడా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీ కాంగ్రెస్ స్ట్రాటజీపై చర్చ జరుగనుంది.
టీ పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సోమవారం ఇవే ఆరోపణలు చేశారు. తనపై పార్టీలోనే దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో ఉండాలా వద్దా అని పార్టీ అధినేత్రికి పది పేజీల లేఖ రాసినట్లుగా చెబతున్నారు. ఇవన్నీ తాను రాహుల్ గాంధీతో జరిగే మీటింగ్‌లో చెబుతానన్నారు. వార్ రూంలో జరిగే స్ట్రాటజీ మీటింగ్‌లో
పార్టీలో అంతర్గత కలహాలపై, కోవర్టుల ఆరోపణలపై నేతలు ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఘర్ వాపసీ, అపరేషన్ ఆకర్ష్, చేరికల అంశంపై కూడా సమావేశంలో చర్చ జరుగనుంది. కేసీఆర్ హటావో తెలంగాణ బచావో నినాదాన్ని ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపై మంతనాలు జరుపనున్నారు. రాహుల్, ప్రియాంక ఖర్గే రాష్ట్ర పర్యటనల షెడ్యూల్‌ను నేతలు ఖరారు చేసే అవకాశం ఉంది.
తెలంంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు ఆసక్తి చూపిస్తూండటంతో... ఆ పార్టీకి హైప్ వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇంత కాలం సైలెంట్ గా ఉన్న అసంతృప్త సీనియర్లు ఇప్పుడు మరోసారి తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మీడియా ముందు ఆరోపణలు చేయడం సంచలనం సృష్టిస్తోంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial