ఐటి దాడులతో హీటెక్కుతున్న తెలంగాణ పాలిటిక్స్- కేసీఆర్ ప్రతి వ్యూహమేంటి?
టీఆర్‌ఎస్‌కి ఎక్కడెక్కడా ఏ ఏ రూపంలో ఎవరెవరి ద్వారా ఆర్థిక బలం అందుతుందో వాటిని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ ఈ దాడులు జరుపుతోందన్న వాదనలు బలంగా రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.
తెలంగాణలో పరిస్ధితులు చూస్తుంటే అప్పుడే ఏముంది ఇంకా ముందు ముందు చాలా ఉంటోందన్నట్లు చెబుతోంది బీజేపీ. ఇదంతా కుట్రలో భాగమేనంటోంది అధికారపార్టీ. అంతేకాదు చర్యకి ప్రతిచర్య ఉంటుందని కూడా కాషాయం పార్టీని హెచ్చరిస్తూనే ఏదో ప్లాన్ వేయబోతోందని చెప్పకనే చెప్పారు. ఇంతకీ కెసిఆర్ కొత్త వ్యూహం ఎలా ఉండబోతోంది ? బీజేపీ లిస్ట్‌లో ఇంకెంతమంది ఉన్నారు ? నెక్ట్స్ టార్గెట్ ఎవరు ? ఇప్పుడిదే రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్.
ఒక్క సీబీఐని రాకుండా అడ్డుకుంటే ఇంకేమీ దారులు లేవా అన్నట్లు తెలంగాణ రాష్ట్రంలో వరస పెట్టి దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికారపార్టీనే టార్గెట్ చేస్తూ కేంద్ర సంస్థలన్నీ రంగంలోకి దిగాయి. నిన్నటి వరకు ఈడీ అయితే ఇప్పుడు ఐటీ కూడా దూకుడు పెంచుతోంది. తెలంగాణ సిఎం కెసిఆర్‌ని, టీఆర్‌ఎస్ పార్టీని దెబ్బతీసే పనిలో భాగంగా బలమైన పునాదులను కదిల్చేందుకు ప్రయత్నిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో టీఆర్‌ఎస్ అత్యంత ధనిక పార్టీల్లో ఒకటన్నది అందరికీ తెలిసిందే. ఈ పార్టీకి ఆర్థికంగా బలాన్నిచ్చే ఆయుధాలను వెతికి మరీ నాశనం చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా ఒకరి తర్వాత మరొకరిపై ఈడీ, ఐటీ దాడులను జరుపుతోందన్నది ఇన్ సైడ్ టాక్.
టీఆర్ ఎస్ నేతల్లో చాలామంది ఆర్థికంగా బలవంతులు ఉన్నారు. అందులో మల్లారెడ్డి ఒకరు. ఈయనపై సొంతపార్టీనే కాదు విపక్షాలతోపాటు స్థానికులు, ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. నిన్నగాక మొన్న ఆయన విద్యాసంస్థలు కనిపించడం లేదన్న కారణంతో రోడ్డువైపున ఉన్న చెట్లన్నింటిని నరికించేశారు. ఇది చిన్న విషయమే కానీ చాలా చాలా పెద్ద ఆరోపణలే మల్లారెడ్డిపై ఉన్నప్పటికీ కెసిఆర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొన్న మునుగోడు ఉపఎన్నికల టైమ్ లోనూ మందు, విందుతోటి వార్తల్లో నిలిచారు.
విద్యాసంస్థలపైనా పలు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పలేనన్ని ఆరోపణలు మల్లారెడ్డిపై ఆయన అనుచరులపై ఉన్నా కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవని విపక్షాలు ఎప్పుడూ ఎత్తి చూపుతూనే ఉంటాయి. ఇప్పుడు దాన్నే అవకాశంగా తీసుకొని బీజేపీ మల్లారెడ్డిపై ఐటీ దాడులు జరుపుతోందన్న టాక్స్ బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు వ్యాపారాలు ఉండటం కొత్తకాదు కానీ తరగని సంపదనిచ్చే మైనింగ్, లిక్కర్, రియల్ ఎస్టేట్ వంటి ప్రధాన వనరులన్నీ టీఆర్‌ఎస్ నేతల దగ్గరే ఉన్నాయని అందుకే గులాబీ నేతలంతా బంగారుమయం అవుతున్నారని విపక్షాలు ఎద్దేవా చేశాయి.
టీఆర్‌ఎస్‌కి ఎక్కడెక్కడా ఏ ఏ రూపంలో ఎవరెవరి ద్వారా ఆర్థిక బలం అందుతుందో వాటిని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ ఈ దాడులు జరుపుతోందన్న వాదనలు బలంగా రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. మొన్న మంత్రి గంగుల, నిన్న మంత్రి తలసాని సోదరులు ఇవాళ మంత్రి మల్లారెడ్డి రేపు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మధ్యనే తెలంగాణ సిఎం, గులాబీ బాస్ కూడా పార్టీ నేతలు, మంత్రులతో అత్యవసర సమావేశమై జర జాగ్రత్తగా ఉండమని హెచ్చిరించారు. దీంతో వరసగా దాడులు జరుగుతుండటంతో నెక్ట్స్ ఎవరన్న భయం ఆపార్టీ నేతలను కలవరపెడుతోంది.
ఇప్పటికే ఈడీ, ఐటీ దాడులతో బేజారెత్తిన కారు పార్టీ ఇప్పుడు ప్రతీకార చర్యగా ఆలోచనలు చేస్తోందని ఆపార్టీ నేతల మాటల్లోనే తెలిసిపోతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల కోనుగోలుతో ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారానికి బదులిచ్చిన కెసిఆర్ రేపు తన పరిధిలో ఉన్న దర్యాప్తు సంస్థలతో దాడులతో బీజేపీ నేతలకు ఎలాంటి షాక్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.