Vikarabad Crime News: కుమారుడి పుట్టిన రోజుకు బంధువులను పిలిచాడు - తలుపులేసి కొట్టి పంపించాడు !
Vikarabad Crime News: కుమారుడి పుట్టిన రోజు వేడుకల కోసం బంధువులు, స్నేహితులను పిలిచి విందు ఇచ్చాడు. ఈ క్రమంలో ఫుల్లుగా మద్యం తాగిన అతను.. మద్యం మత్తులో వారందరిపై దాడి చేశాడు.
Vikarabad Crime News: కుమారుడి మొదటి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరపాలనుకున్నాడు. ఈ క్రమంలోనే బంధువులు, స్నేహితులందరినీ పిలిచాడు. గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేట్ చేశాడు. ఆపై అంతా కలిసి విందు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అతడు ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆపై ఇంటికి వచ్చిన బంధువుల్లో ఒక వ్యక్తిని కారు ఇవ్వమని అడిగాడు. అయితే ఇతను ఫుల్లుగా తాగి ఉండడంతో అతను ఇవ్వనని చెప్పాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన సదరు వ్యక్తి.. అందరిపై దాడికి పాల్పడ్డాడు. ఇష్టం వచ్చినట్లుగా దొరికిన వాటితో కొట్టి.. వారందరినీ ఇంట్లో బంధించి తాళం వేశాడు. వారు 100 డయల్ కు ఫోన్ చేసి జరిగినదంతా చెప్పగా పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకొని సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే..?
వికారాబాద్ జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న అత్వెల్లికి చెందిన నవీన్ అనే వ్యక్తి భార్యా, ఓ కుమారుడు ఉన్నారు. అయితే ఫిబ్రవరి 13వ తేదీన వీరి కొడుకు మొదటి పుట్టిన రోజు. కుమారుడి పుట్టిన రోజును ఘనంగా చేయాలనుకున్న తల్లిదండ్రులు.. బర్త్ డే కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బంధువులతో పాటు స్నేహితులందరినీ పిలిచారు. ఇంటికి వచ్చిన అందరికీ సకల మర్యాదలూ చేశారు. కుమారుడితో కేక్ కూడా కట్ చేయించారు. ఆపై అందరూ విందులో పాల్గొన్నారు. పురుషులు మద్యం సేవించగా.. మహిళలు భోజనం చేశారు. ఇప్పటి వరకూ అంతా బాగానే ఉంది. కానీ నవీన్ ఫుల్లగా మద్యం సేవించాడు. ఇదే పుట్టిన రోజు వేడుకల్లో అల్లకల్లోలం జరిగేలా చేసింది.
"సార్.. ఆయన మా చుట్టాలాయన సార్. అద్దాలు పెట్టుకున్నతని పేరు సురేష్. అతను కారు ఇవ్వమంటే నాకు ఇవ్వలేడు సార్. డ్రైవింగ్ చేస్తా అంటే. తాగున్నవని తిట్టిండు సార్. నాకు కోపం అచ్చింది. అందుకే కొట్టిన సార్. 3 లైట్ బీర్లు తాగిన సార్ అంతే. నేనేం పిల్లల్ని కొట్టలేదు. గంజాయి తాగ సార్ నేను. అదంతా తప్పు." - నవీన్, నిందితుడు
100 డయల్ కు ఫోన్ చేసి తప్పించుకున్న బంధువులు
మద్యం మత్తులో ఉన్న నవీన్.. తమ బంధువుల్లో ఒకరైన రాజు దగ్గరకు వెళ్లి తన కారును కాసేపు ఇవ్వమని కోరాడు. అయితే నవీన్ అప్పటికే బాగా తాగి ఉండడంతో.. రాజు వద్దు ఇవ్వవనని చెప్పాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన అతడు.. ముందుగా రాజుపై, ఆపై బర్త్ డేకు వచ్చిన పిల్లా, పెద్దలందరిపై దాడికి పాల్పడ్డాడు. అందిన వాటితో వాళ్లను కొడుతూ నానా రచ్చ చేశాడు. వారందరినీ ఇంట్లో బంధించి బయట తాళం వేశాడు. అతడేం చేస్తున్నాడో తెలియక లోపల బంధీగా ఉన్న బంధువులు, స్నేహితులంతా భయంతో గజగజా వణికిపోయారు. ఈ క్రమంలోనే 100 డయల్ కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నవీన్ ను అరెస్ట్ చేసి బంధువులు, స్నేహితులను బయటకు తీసుకవచ్చారు. బయటకు వచ్చిన వారంతా తిరిగి వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయారు.