Waqf Board Chairman: వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌ని రాజీనామా చేయించాలని టీఆర్‌ఎస్ యత్నాలు! మరి ఆయనేమంటున్నారు?
టీఆర్ఎస్ నేతలు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, అటు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కూడా దీన్ని ఖండించకపోవడంతో విపక్ష నేతలు విమర్శలు మరింతగా చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడు ఉన్నట్లు ఆరోపణలు రావడం ఆయన పదవికే ఎసరు తెచ్చేలా ఉంది. ఈ ఆరోపణల నేపథ్యంలో వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని టీఆర్‌ఎస్ ఆదేశించింది. ఈ మేరకు హోం మంత్రి మహమూద్ అలీ ద్వారా ఆయన్ను రాజీనామా చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఆయనకు నచ్చ చెప్పి ఎలాగైనా రాజీనామా చేయించేలా చేయటానికి హోమంత్రి మహబూద్ అలీ యత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ప్రజా ప్రతినిధుల పిల్లలను కాపాడడానికి ప్రయత్నిస్తోందని టీఆర్ఎస్ పై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణల వేళ ఇటు టీఆర్ఎస్ నేతలు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, అటు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కూడా దీన్ని ఖండించకపోవడంతో విపక్ష నేతలు విమర్శలు మరింతగా చేస్తున్నారు. ఈ విషయంలో తాము కఠినంగా ఉన్నామని చాటేందుకే ఆరోపణలు ఎదుర్కొంటున్న పిల్లల్లో వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు ఉండడంతో ఆయన పదవికి రాజీనామా చేయించాలని టీఆర్ఎస్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నట్లు తెలుస్తోంది.
ఇన్నోవా కారు ఆయనదా? కాదా?
బాలికపై గ్యాంగ్ రేప్ కోసం వాడిన తెలుపు రంగు ఇన్నోవా కారుపై ప్రభుత్వ వాహనం అని ఉన్నట్లుగా పోలీసులు తేల్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ కారు వక్ఫ్ బోర్డు చైర్మన్ వినియోగిస్తున్న వాహనమా లేదా అనే దానిపై స్పష్టత రాలేదని పోలీసులు చెప్పారు. 2019లోనే కొన్న ఆ ఇన్నోవా వాహనం సనత్ నగర్ ప్రాంతానికి చెందిన దినాజ్ జహాన్ పేరుతో ఉంది. వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కేసులో నిందితుడైన ఓ బాలుడి తండ్రి ఆ వాహనాన్ని లీజుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కారు టెంపరరీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వివరాలు ఇవ్వాల్సిందిగా ఆర్టీఏ అధికారులకు పోలీసులు లెటర్ రాశారు.
మరోవైపు, వాహనం వివరాలు కోరుతూ దినాజ్ జహాన్‌తో పాటు వక్ఫ్ బోర్డుకు నోటీసులు ఇవ్వాలని, లేఖ రాయాలని పోలీసులు నిర్ణయించారు. వీటికి సమాధానాలు వస్తే అది వక్ఫ్‌బోర్డు లీజుకు తీసుకుని ఛైర్మన్‌కు కేటాయించిన అధికారిక వాహనమా? లేక ఛైర్మన్ వ్యక్తిగతంగా తీసుకున్నదా? అనే దానిపై ఓ స్పష్టత రానుంది. ఇక నేరానికి వాడిన మరో కారు మెర్సిడిస్ బెంజ్ కారు మాత్రం కేసులో నిందితుడైన ఓ బాలుడి తల్లి పేరుతో ఉందని, దాన్ని అతనే వాడుతున్నట్లుగా పోలీసులు తేల్చారు. ఒక మైనర్‌కు వాహనం ఇవ్వడంతో ఆమెకు కూడా పోలీసులు నోటీసులు ఇవ్వాలని చూస్తున్నారు.