Telangana TET 2025: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ- జనవరిలో పరీక్షలు
Telangana TET 2025: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. దరఖాస్తులు ఈనెల 15 నుంచి 29 వరకు స్వీకరిస్తారు. జనవరిలో పరీక్షలు జరగనున్నాయి.

Telangana TET 2025: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తిలో చేరాలని చదువుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డీఎస్సీ రాయడానికి అర్హత సాధించే టెట్ నోటిఫికేషన్ మరోసారి విడుదల చేసింది. ఇప్పటికే జూన్‌లో ఒకసారి టెట్ నిర్వహించింది. ఇప్పుడు మరోసారి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష రాబోయే ఉపాధ్యాయ నియామకాలకు కీలకంగా మారనుంది. ఈసారి కూడా టెట్‌ను పూర్తిగా ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహిస్తన్నారు. ఇది ఒకసారి అర్హత సాధిస్తే ఈ సర్టిఫికెట్‌కు జీవితకాలం చెల్లుబాటు కానుంది.
రాష్ట్రంలో ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఉపాధ్యాయులుగా పనిచేయడానికి టెట్ అర్హత తప్పనిసరి. విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, అధునాతన సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తూ, పారదర్శకంగా టెట్ నిర్వహణకు సిద్ధమైంది. అప్లికేషన్ ప్రక్రియ నవంబర్ 15, 2025 నుంచి ప్రారంభమవుతుంది.
సాంప్రదాయక ఓఎంఆర్ (OMR) విధానానికి స్వస్తి చెప్పి, ఈసారి టీజీ-టెట్ పూర్తిగా ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష జూన్‌లో టెట్ నిర్వహించింది. ఇప్పుడు కూడా అదే విధానంలో టెట్ జరగనుంది.
ముఖ్యమైన తేదీలు మరియు సమయాలు:
• నోటిఫికేషన్ విడుదల: 13.11.2025.
• ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 15.11.2025.
• దరఖాస్తు సమర్పణ, ఫీజు చెల్లింపు తుది గడువు: 29.11.2025.
• పరీక్ష సమయాలు: ఉదయం 9.00 AM నుంచి 11.30 AM వరకు, మధ్యాహ్నం 2.00 PM నుంచి 4.30 PM వరకు (ప్రతి సెషన్ 2 గంటల 30 నిమిషాలు).
*పరీక్ష తేదీలు:- జనవరి 2026
పరీక్ష సమయాల్లో మార్పు లేదు; ప్రతి పేపర్‌కు 2 గంటల 30 నిమిషాల సమయం కేటాయిస్తారు. అభ్యర్థులు తమకు నచ్చిన పరీక్షా కేంద్రం (జిల్లా) ప్రాధాన్యతను ఆన్‌లైన్ దరఖాస్తులో సమర్పించవచ్చు, అయితే సామర్థ్యాన్ని బట్టి కేంద్రాలను కేటాయించే అధికారం కన్వీనర్‌కు ఉంటుంది.
టెట్ స్కోర్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. ఉద్యోగంలో 20% వెయిటేజీ ఉంటుంది. టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ లో ఈ టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఇస్తారు. అంటే, టెట్ పరీక్షలో అధిక మార్కులు సాధించడం ద్వారా అభ్యర్థులు ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువు సాధించడంలో 20 శాతం విజయాన్ని ఇప్పటికే దక్కించుకున్నట్లే. అందుకే, ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే కాదు, ఉద్యోగాన్ని నిర్ణయించే కీలకమైన మెట్టుగా అభ్యర్థులు భావించాలి.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
టీజీ-టెట్ 2025లో రెండు పేపర్లు ఉంటాయి:
1. పేపర్-I: 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించాలనుకునే వారికి.
2. పేపర్-II: 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకునే వారికి. 1 నుంచి 8 తరగతుల వరకు బోధించాలనుకునే వారు రెండు పేపర్లూ రాయాల్సి ఉంటుంది.
అర్హతలు: అభ్యర్థులు తప్పనిసరిగా డి.ఎల్.ఎడ్ (D.El Ed.)/ డి.ఎడ్ (D.Ed.) / బి.ఎడ్ (B.Ed.) / లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమాన అర్హతలను కలిగి ఉండాలి. అంతేకాకుండా, ప్రస్తుతం ఈ కోర్సుల ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ పరీక్షకు హాజరు కావడానికి అర్హులే.
మునుపటి టెట్‌లలో క్వాలిఫై అయిన అభ్యర్థులు కూడా తమ స్కోర్‌ను మెరుగుపరుచుకోవడానికి ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, కేవలం టెట్‌లో ఉత్తీర్ణత సాధించినంత మాత్రాన ఉద్యోగానికి ఎటువంటి హక్కు లభించదు.





















