Telangana Hydro Power: రాష్ట్ర జలవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1302 మెగావాట్లు- కేంద్రమంత్రి ఆర్కే సింగ్ వెల్లడి
Telangana Hydro Power: తెలంగాణ రాష్ట్ర జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1302 మెగావాట్లు అని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు.
Telangana Hydro Power: తెలంగాణ రాష్ట్రంలో భారీ, మధ్య తరహా పథకాలకు 1302 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. లోక్ సభలో బీఆర్ఎస్ సభ్యులు వెంటకేష్ నేత జి. రంజిత్ రెడ్డిలు గురువారం రోజు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ సమాధానం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న జల విద్యుత్ కేంద్రాలను మాత్రమే అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ప్రియదర్శిని జూరాల 234, పోచంపాడు 36, నాగార్జున సాగర్ 110, నాగార్జున సాగర్ ఎల్బీసీ 60, లోయర్ జూరాల 240, పులిచింతల 120 మెగావాట్ల సామర్థ్యంతో పని చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో యురేనియం కాలుష్యం ప్రభావం ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలిందని తెలిపారు. ఇందులో ఆదిలాబాద్, హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు ఉన్నట్లు చెప్పారు.
తెలంగాణలో 145, ఏపీలో 74 న్యాయాధికార పోస్టులు ఖాళీ
సబార్డినేట్ కోర్టులల్లో తెలంగాణలో 145, ఏపీలో 74 న్యాయాధికార పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ తెలిపారు. వీటి భర్తీలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉండదని పేర్కొన్నారు. వాటి నియామక బాధ్యత, రాష్ట్ర హైకోర్టులు, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలదేనని అన్నారు. జులై 28 నాటికి తెలంగాణలో 560 మంది న్యాయాధికారులకు గాను 415 మంది సేవలు అందిస్తున్నట్లు వివరించారు. 2019 నుంచి 2023 మధ్యలో అంటే ఐదేళ్ల కాలంలోనే సుప్రీం కోర్టుకు 33, దేశంలోని 25 హైకోర్టులకు 497 మంది న్యాయమూర్తులను నియమించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కాలంలో తెలంగాణ హైకోర్టుకు 28 మంది, ఏపీ హైకోర్టుకు 27 మంది జడ్జిలను నియమించినట్లు చెప్పారు.
ఐదేళ్లుగా ఎలాంటి పురావ్తు తవ్వకాలు చేపట్టలేము
భారత పురావస్తు సర్వే సంస్థ గత ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి తవ్వకాలూ చేపట్టలేదని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం రోజు రాజ్యసభలో బీజేపీ సభ్యుడు కె. లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం చెప్పారు. అలాగే చారిత్రక కట్టడాల సంరక్షణ కోసం పురావస్తు పరిశోధనలు చేసినట్లు వెల్లడించారు. 2019లో గోల్కొండ కోటలోని నయాఖిలా వద్ద సైంటిఫిక్ క్లియరెన్స్ కోసం పరిశోధనలు చేపట్టినట్లు వివరించారు. అలాగే 2022లో వరంగల్ కోటలో జీపీఆర్ సర్వే నిర్వహించినట్లు చెప్పారు. నయాఖిలాలో చేపట్టిన సైంటిఫిక్ క్లియరెన్స్ వర్క్ లో భారీ ట్యాంకులు, పురాతన ఉద్యానవనాలు, భాగ్ కు దారితీసే మెట్ల విమానాలు, టెర్రాకోట పైప్ లైన్, సమాంతర నీటి కాలువలు బయట పడినట్లు స్పష్టం చేశారు.
అలాగే తెలంగాణలోని 33 జిల్లాల్లో కలిపి అసంఘటిత కార్మికులకు ఉద్దేశించిన ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పింఛన్ స్కీం కింద 42 వేల 160 మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలిపారు. గురువారం రాజ్యసభలో బీఆర్ఎస్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులు ఇచ్చారు. ఈ పథకం కింద 60 సంవత్సరాలు నిండిన అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ.3 వేలు చొప్పున పింఛన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. దీనికోసం సంగారెడ్డి జిల్లా నుంచి ఎక్కువగా 4 వేల 237 మంది పేర్లు నమోదు చేసుకోగా.. ములుగు నుంచి అతి తక్కువగా 14 మంది మాత్రమే నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు.