Harish Rao: సిద్దిపేటలో 300 మందికి రూ.1 లక్ష చెక్కులు అందజేసిన మంత్రి హరీష్ రావు
Telangana Minister Harish Rao: బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కులవృత్తుల ప్రోత్సహం కోసం ఆదివారం రూ.1 లక్ష చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని సిద్దిపేటలో నిర్వహించారు.
Telangana Minister Harish Rao: రైతు భీమా తరహాలో త్వరలోనే కార్మిక భీమా అందిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేటలో కార్మిక భవన్ కు ఎకరం స్థలం కేటాయించారు. సిద్దిపేటలో భవన నిర్మాణ కార్మికుల బహిరంగ సభలో రాష్ట్ర మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కార్మికుడి కార్డు రెన్యూవల్ పదేళ్లకు పెంచుతున్నామని చెప్పారు. కార్మి భీమా మొత్తాన్ని లక్షన్నర నుంచి రూ.3 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ప్రతీ కార్మికుడి డిజిటల్ కార్డుకయ్యే ఖర్చు బాధ్యత తమదేనని, 5 లక్షల రూపాయల వరకూ ఉచితంగా ఆరోగ్య శ్రీ వైద్య సేవలు కార్మికులు అందిస్తామని ప్రకటించారు.
దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసి వారి కాళ్లపై వాళ్లు నిల్చునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. ఇదే తరహాలో బీసీలకు ఆర్థిక చేయూత కోసం సీఎం కేసీఆర్ రూ.లక్ష బీసీబంధుని తీసుకొచ్చారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బీసీల నుంచి కొన్ని కుల, చేతి వృత్తుల వారి నుంచి దరఖాస్తులు తీసుకుని, పరిశీలించిన అనంతరం అర్హుల జాబితాను సిద్ధం చేశారు. సిద్దిపేట వయోలా గార్డెన్స్‌లో బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కులవృత్తుల ప్రోత్సహం కోసం ఆదివారం రూ.1 లక్ష చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇస్తున్న రూ.లక్ష బీసీబంధుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేట నియోజకవర్గంలో 300 మంది లబ్ధిదారులకు రూ.1 లక్ష చెక్కులను ఆయన అందజేశారు. ఇది ఆరంభమని, బీసీల సంక్షేమం ఆర్థిక చేయూత కోసం ఇది నిరంతర ప్రక్రియ అన్నారు.
కులవృత్తులను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందన్నారు. ఇందులో భాగంగా బీసీలలో కుల వృత్తులు, చేతి వృత్తుల వారిని ఆదుకునేందుకు రూ.లక్ష గ్రాంట్ ను సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని చెప్పారు. అర్హులైన వారందరికీ దశల వారీగా అందిస్తామన్నారు మంత్రి హరీష్. గత ప్రభుత్వాలు బీసీలకు 60శాతం సబ్సిడీ, బ్యాంకులు 40శాతం అని బ్యాంకు లింక్ పేరిట కొర్రీలు పెట్టేదన్నారు. లోన్ షూరిటీ కోసం చెప్పులు అరిగేలా తిరిగినా అందరికీ ప్రయోజనం చేకూరేది కాదని చెప్పారు. ఇవన్నీ తెలిసిన నేత కనుకే సీఎం కేసీఆర్ బీసీలకు, రైతులకు కానీ ఎలాంటి షూరిటీ, డాక్యుమెంట్స్ లేకుండా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో చెప్పిన మేరకు నగదు జమ చేస్తున్నారని పేర్కొన్నారు.
రజకులు, నాయి బ్రాహ్మణులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత కరెంటు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వైన్స్ లో రిజర్వేషన్లతో పాటు గీత కార్మికులకు లైసెన్స్ ఆటో రెన్యూవల్ చేస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారులు సిద్దిపేట నుంచి ఇతర రాష్ట్రాలకు చేపలు ఎగుమతి చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం సాధించుకున్నాక 300 బిసి రెసిడెన్షియల్ హాస్టల్స్ ఏర్పాటయ్యాయి. సిద్ధిపేటకు వారం రోజుల్లో డిగ్రీ బిసి రెసిడెన్షియల్ విద్యా సంస్థ తీసుకువస్తానని మంత్రి హరీష్ ప్రకటించారు. అన్ని కులాలు, వర్గాల వారి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పలు పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారని, ఆయన నాయకత్వంలో ముందుకు సాగుదామన్నారు.