KTR Davos: స్విట్జర్లాండ్‌లో మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు, సోమవారం దావోస్‌కు
స్విట్జర్‌లాండ్ లోని దావోస్‌లో జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి మంత్రి కేటీఆర్ జ్యూరిక్ చేరుకున్నారు.
స్విట్జర్లాండ్ లో మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం లభించింది. స్విట్జర్‌లాండ్ లోని దావోస్‌లో జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు జ్యూరిచ్ విమానాశ్రయంలో ఎన్నారైలు భారీ ఎత్తున వచ్చి ఘన స్వాగతం పలికారు.
జ్యూరిచ్ నగరంలోనే కాక, స్విట్జర్‌లాండ్‌లోని ఇతర నగరాలు, యూరోప్‌లోని ఇతర దేశాల నుండి వచ్చిన ఎన్నారైలు విమానాశ్రయంలో మంత్రికి స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు శ్రీధర్ గండె, ఇతర తెలుగు సంఘాల ప్రతినిధులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం జ్యూరిక్ నగరంలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన "మీట్ ఎండ్ గ్రీట్" కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. సోమవారం డావోస్ చేరుకొని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొంటారు.
స్విట్జర్లాండ్లోని దావోస్‌లో 2023లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశం ప్రతి ఏడాది తరహాలోనే నిర్వహించనున్నారు. World Economic Forum వార్షిక సమావేశం జనవరి 16 నుండి 20 వరకు నాలుగు రోజులపాటు జరుగుతుంది. ఇందులో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, ఏపీ ఐటీశాఖ మంత్రి, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ముఖ్యమంత్రులు అశ్విని వైష్ణవ్, స్మృతి ఇరానీ సహా 100 మందికి పైగా భారతీయులు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశానికి హాజరుకానున్నారు.
ఈ అంశాలపై చర్చించనున్న నేతలు
దావోస్‌లో జరిగే వార్షిక సమావేశంలో తక్షణ ఆర్థిక, ఇంధన మరియు ఆహార సంక్షోభాలను పరిష్కరించాలని చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు మరింత స్థిరమైన మరియు స్థితిస్థాపక ప్రపంచానికి పునాది వేయాలని ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రపంచ నాయకులను ఆహ్వానించింది. ఈ సమావేశంలో ఆసియా దేశాలు ముఖ్యంగా జపాన్, చైనా వంటి దేశాలు గణనీయంగా పాల్గొంటాయని WEF ఆశాభావం వ్యక్తం చేసింది.
ఆర్థిక సదస్సుకు నలుగురు కేంద్ర మంత్రులు
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి భారతదేశానికి చెందిన వ్యాపారవేత్తలతో పాటు కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవియా, అశ్విని వైష్ణవ్, స్మృతి ఇరానీ, ఆర్కే సింగ్ కూడా హాజరు కానున్నారు. దావోస్ వేదికగా జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సు సమావేశం థీమ్ "విచ్ఛిన్నమైన ప్రపంచంలో సహకారం", ఇది పెద్ద సమస్యలను ప్రపంచం ముందు ఉంచడంతో పాటు కొత్త పరిష్కారాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 52 దేశాల అధినేతలతో పాటు 130 దేశాల నుంచి దాదాపు 2,700 మంది ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది.
అంతర్జాతీయ నేతలు ఎవరంటే..
ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యే వారిలో జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ ఎం. రామఫోసా, యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ రాబర్ట్ మెత్సోలా, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్, ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్, పలు దేశాల నాయకులు పాల్గొననున్నారు. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలిన్ జార్జివా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఎన్‌గోజి ఒకాంజో ఇవేలా, నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ కూడా సదస్సులో పాల్గొంటారు.