Hyderabad: జంటనగరాల ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త - ఇండ్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగిస్తూ నిర్ణయం
హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువును తెలంగాణ ప్రభుత్వం మరో నెల రోజుల వరకు పొడిగించింది.
Houses land regularization in Hyderabad: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువుపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువును తెలంగాణ ప్రభుత్వం మరో నెల రోజుల వరకు పొడిగించింది. ప్రభుత్వ స్థలాల్లో పేదలు కట్టుకున్న ఇండ్ల నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా, నిబంధనల మేరకు ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జీవో 58-59 ప్రకారం జంట నగరాల్లోని ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువును మరో నెల రోజులు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ అంశంపై సీఎం కేసీఆర్ నూతన సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. నగర ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరంలో తమ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలను కలిసి ప్రజలు తమకున్న నోటరీ తదితర ఇండ్ల స్థలాల రెగ్యులేషన్ సమస్యలను తెలపాలని సూచించారు. సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి వారికి హక్కుతో కూడిన పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మొట్టమొదటి సమీక్షా సమావేశం
కొత్తగా ప్రారంభించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మొట్టమొదటి సమీక్షా సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులను కొనసాగించడానికి అనుమతించిన నేపథ్యంలో సోమవారం సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కూలంకంషంగా చర్చించారు. ఇందులో భాగంగా జూలై వరకు కరివెన జలాశయంకు నీళ్ళు తరలించాలని, ఆగష్టు వరకు ఉద్దండాపూర్ వరకు నీటిని ఎత్తిపోయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో నార్లపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాలకు సంబంధించి మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వాటి సంబంధిత పంప్ హౌజ్ లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, ఒక రిజర్వాయర్ నుంచి మరొక రిజర్వాయర్ కు నీటిని తరలించే ‘కన్వేయర్ సిస్టమ్’ లో మిగిలిన పనులను కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పాలమూరు జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పనులకు సంబంధించిన పురోగతిపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. వాటిలో మిగిలిన కొద్దిపాటి పనులను ఈ జూన్ లోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కార్మికులకు మే డే కానుక ఇచ్చిన కేసీఆర్
పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను రూ.1000 మేర పెంచుతూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా 1 లక్షా 6 వేల 474 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. పెరిగిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. పనిలో పనిగా ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.