Governor Tamilsai: వాళ్లని గౌరవించే దేశంలోనే అభివృద్ధి - మహిళా దినోత్సవ వేడుకల్లో గవర్నర్
International Womens Day 2024: సందర్భంగా బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ లో రాచకొండ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సదస్సు నిర్వహించడం జరిగింది.
Telangana News: ఈ రోజుల్లో పురుషులతో సమానంగా మహిళలు పోటీపడుతున్నారని తెలంగాణ గవర్నర్ తమిళసై అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ లో రాచకొండ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, మహిళా అధికారులు మరియు పోలీసు విభాగాలకు చెందిన ఇతర సిబ్బంది సదస్సుకు హాజరై కుటుంబం సమాజంలో మహిళల పాత్రను వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ మాట్లాడుతూ.. భారతదేశం శతాబ్దాల తరబడి అనుసరించిన మాతృస్వామ్య వ్యవస్థను గుర్తు చేస్తూ దానిని కొనియాడారు. ఒక మహిళగా జన్మించడం చాలా అదృష్టమని అభిప్రాయపడ్డారు. ఒక పురుషుని జీవితంలో తల్లిగా, సోదరిగా, భార్యగా, స్నేహితురాలుగా స్త్రీలు బహుళ పాత్రలు పోషిస్తారు కాబట్టి పురుషులు వారి జీవితంలో మహిళలు లేకుండా మనుగడ సాగించలేరని అన్నారు. మహిళల్లో సంకల్ప శక్తి ఎక్కువగా ఉందని, ఏదైనా సాధించగలరని అన్నారు. తన విద్య మరియు వృత్తిపరమైన ఎదుగుదలలో, ప్రజా సేవా రంగంలో ప్రవేశించి గవర్నర్ పదవి వరకూ చేరుకోవడంలో పడిన కృషిని పేర్కొన్నారు. తన కుటుంబం నుండి తనకు లభించిన సహకారాన్ని ఆమె వివరించారు. వారి జీవితంలో ఎదుర్కొన్న రంగు, ఎత్తు వంటి రకరకాల వివక్షలను, వారి ప్రతిభను ప్రదర్శించడంలో ఎదురైన అవరోధాలను అధిగమించిన తీరును వివరించారు.
మహిళా అధికారులందరూ పోలీసు శాఖలో భాగమై సమాజానికి చేస్తున్న కృషిని అభినందించారు. మహిళలు డాక్టరు, న్యాయవాదులుగా, ఉపాధ్యాయులుగా మాత్రమే కాక పోలీసు అధికారులుగా కూడా సమర్థవంతంగా పని చేయగలరని, గృహ హింస మరియు వైవాహిక వివాదాలలో బాధితులైన మహిళలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు మహిళా పోలీసు అధికారులు అనేక రకాల విధులను నిర్వహించగలరని గవర్నర్ పేర్కొన్నారు. మహిళా అధికారులందరూ తమ పూర్తి శక్తితో పని చేయాలని సూచించారు. మహిళలు తమ కలల సాకారం కోసం అహర్నిశలూ పాటుపడాలని సూచించారు.
రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం సందర్భంగా తమ గళాన్ని వినిపించిన వక్తలందరినీ అభినందించారు. మహిళా అధికారులు మరియు సిబ్బంది పురుషుల కంటే తక్కువ కాదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో తల్లి మొదటి స్నేహితురాలు, గురువు అని, తల్లి ద్వారానే ప్రతీ ఒక్కరూ ప్రపంచానికి పరిచయం అవుతారు అని, సమాజాన్ని అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు. పురుషుల కంటే స్త్రీలకు నిబద్ధత ఎక్కువ కాబట్టి ఏదైనా సాధించగలరని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో వేల మంది మహిళలు సమర్థవంతంగా పని చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మహిళా అధికారులందరూ తమ వృత్తిపరమైన బాధ్యతలను గౌరవంగా నిర్వహించాలని ఆయన సూచించారు.
Addressed the International Women's Day Celebrations at BITS Pilani,#Hyderabad.Organized by Rachakonda Commissionarate Office,Hyderabad.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) March 6, 2024
హైదరాబాద్లోని బిట్స్ పిలానీలో రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించాను.@MinistryWCD… pic.twitter.com/dbm6U7IR91