Telangana News: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు- సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
BC Reservations in Telangana | తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Telangana Local body Elections 2025 | హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అంశం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై రాష్ట్ర హైకోర్టు ఈ నెల 9న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
రాజ్యాంగంలో అలా ఎక్కడా ప్రస్తావన లేదు..
తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొన్న ప్రకారం, రిజర్వేషన్లను 50 శాతం పరిమితికి లోబడి ఉండాలని రాజ్యాంగంలో ఎలాంటి నిబంధనలు లేవని స్పష్టం చేసింది. 50 శాతం పరిమితి అనేది కేవలం సుప్రీంకోర్టు (Supreme Court) మార్గదర్శకంగా మాత్రమే పేర్కొన్న విషయాన్ని స్పష్టం చేసింది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రిజర్వేషన్లు అంతకుమించి ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు ‘ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’, ‘జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసుల్లో స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం తమ పిటిషన్లో పేర్కొంది.
ట్రిపుల్ టెస్ట్ ప్రక్రియను పాటించామన్న తెలంగాణ ప్రభుత్వం..
తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అవసరమైన ట్రిపుల్ టెస్ట్ ప్రక్రియను కూడా పాటించినట్లు తెలిపింది. గతంలో మహారాష్ట్రలో జరిగిన వికాస్ కిషన్‌రావ్ గవ్లీ కేసులో సుప్రీంకోర్టు ఈ విధానాన్ని స్పష్టంగా వివరించిందని పిటిషన్‌లో ప్రస్తావించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే ముందు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర, శాస్త్రీయ అధ్యయనం జరిపిందని తెలిపింది. 2024–25లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల ఆధారిత సర్వే ప్రకారం రాష్ట్రంలో 56.33 శాతం బీసీ జనాభా ఉంది. దాని ఆధారంగా రిజర్వేషన్లను 42% గా నిర్ణయించినట్లు వివరించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 342-ఎ(3) కింద రాష్ట్రాలకు ఉన్న అధికారాల ప్రకారం కసరత్తు చేసి నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి అధ్యయనాన్ని సుప్రీంకోర్టు 'రాహుల్ రమేశ్ వాఘ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర' కేసులో సమర్థించిందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. సమగ్ర సర్వే ఆధారంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి సర్వే డేటాను విశ్లేషించామని తెలిపింది. ఆ కమిషన్ చేసిన సిఫార్సుల తరువాతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు ఆమోదం తెలిపినట్లు సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లు - 2025ను మార్చి 17, 18 తేదీల్లో శాసనసభ, శాసనమండలిలో ఏకగ్రీవంగా ఆమోదించిన తరువాతే తెలంగాణ గవర్నర్ ఆమోదానికి పంపినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
హైకోర్టు తీర్పుపై సుప్రీం ఏమంటుందో..
రిజర్వేషన్లు 50 శాతాం పరిమితి అనేది రాజ్యాంగ ప్రకారం కాదని, కేవలం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అని తెలిపింది. పరిస్థితుల ఆధారంగా రిజర్వేషన్ల పరిమితి పెంపునకు అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో సడలింపు ఇవ్వాలి. కనుక దీన్ని ప్రత్యేక కేసుగా భావించాలని.. జనహిత్ అభియాన్ కేసు తీర్పులో ఈ అంశాన్ని పేర్కొన్నారు. అది దృష్టిలో ఉంచుకుని జీవో9 జారీ చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ తెలిపింది. కనుక హైకోర్టు స్టే ఎత్తివేసి.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకునేలా అనుమతి ఇవ్వాలని పిటిషన్లో కోరింది.






















