Rains in Telangana: వచ్చే మూడు రోజులు భారీ వర్షాలే, కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి మంగళవారం (సెప్టెంబరు 5) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మరో రెండు రోజులు తీవ్రంగా ఉన్నందున సహాయక చర్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను శాంతికుమారి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి మంగళవారం (సెప్టెంబరు 5) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని పరిస్థితులను కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి.. పరిస్థితులను ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు.
భారీ వర్షాలు, వరదలతో జరిగే నష్టాన్ని నివారించేందుకు సంబంధిత మండల స్థాయి రెవెన్యూ, పీఆర్ తదితర అధికారులతో రెగ్యులర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించాలని నిర్దేశించారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు మ్యాన్ హోల్స్ పై మూతలు తెరవకుండా నగరవాసులను చైతన్యం చేయాలని నిర్దేశించారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని చెరువులు, కుంటలు నిండి ఉన్నాయని, ఆయా చెరువులకు గండ్లు పడటం, తెగిపోకుండా ఉండేందుకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ ఎత్తున ప్రవహించే కాజ్ - వేలు, కల్వర్టులు, వంతెనల వద్ద ముందు జాగ్రత్త చర్యగా తగిన భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని అన్నారు.
ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షించాలని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం అగ్నిమాపక, పోలీసు బృందాలను మోహరించాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.