V Hanmanth Rao: వీహెచ్ ఇంటిపై రాళ్ల దాడి, కారు ధ్వంసం! నిందితుడు ఇతనే - VHను పరామర్శించిన రేవంత్
VH: తన ఇంటిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని, అతణ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వీహెచ్ ట్యాంక్ బండ్ పైన ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు (వీహెచ్) ఇంటిపై దాడి జరిగింది. దుండగులు గత అర్ధరాత్రి ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఇంటి ఎదురుగా ఉన్న వీహెచ్(VH) కారును కూడా ధ్వంసం చేశారు. హైదరాబాద్(Hyderabad) లోని డీడీ కాలనీలో వీహెచ్ నివాసం ఉంటున్నారు. అక్కడే ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే వీహెచ్ అంబర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో వీహెచ్ ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటనలో ఆయనతోపాటు కుటుంబ సభ్యులు ఎవరికీ గాయాలు కాలేదు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టారు.
అంబేడ్కర్ విగ్రహం ఎదుట వీహెచ్ ఆందోళన
అయితే, తన ఇంటిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని, అతణ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వీహెచ్ ట్యాంక్ బండ్ పైన ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. దీనిపై అంబేడ్కర్ కమిటీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వీహెచ్ ఇంటిపై దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన ఆందోళన విరమించారు.
మద్యం మత్తులో దాడి
మద్యం మత్తులో ఓ వ్యక్తి వీహెచ్ ఇంటిపై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి పేరు సిద్ధార్థ్ సింగ్ అని.. అతను ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు వెల్లడించారు.
ఖండించిన రేవంత్ రెడ్డి
వీ హనుమంతరావు ఇంటిపై దాడిని తెలంగాణ పీసీసీ నేతలు ఖండించారు. వీహెచ్‌తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోనులో మాట్లాడి ఆరా తీసి ఆయన్ను పరామర్శించారు. పూర్తి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణలో రోజు రోజుకూ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నాయకులకు పోలీసులు మరింత భద్రత కల్పించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులపై దాడులు జరిగితే ఊరుకునేది లేదు.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.