Telangana Elections 2023: ఈ సీట్లు ఇంకా పెండింగ్‌లోనే ఉంచిన కాంగ్రెస్, తర్జనభర్జనతో రంగంలోకి కీలక నేత
కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, చార్మినార్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఇంతవరకూ ప్రకటించలేదు.
Telangana Latest News: తెలంగాణలో నామినేషన్ల దాఖలుకు గడువు రేపటితో ముగియనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనేలేదు. కాస్త జటిలంగా ఉన్న ఆ నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయడానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగారు. ఈ పెండింగ్‌లో ఉన్న స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్ధులను వెంటనే ప్రకటిస్తామని కేసీ వేణుగోపాల్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, చార్మినార్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఇంతవరకూ ప్రకటించలేదు. ఆ స్థానాల్లో ఒకరికంటే ఎక్కువ అభ్యర్థులు ఉన్నప్పటికీ ఒకరి పేరు ప్రకటిస్తే మరొకరు రెబల్ మారే అవకాశం ఉంది. సూర్యాపేటలో పరిస్థితి మరీ ఇబ్బందిగా మారింది. ఇక్కడ పటేల్ రమేశ్ రెడ్డి. దామోదర్ రెడ్డి ఇద్దరు కాంగ్రెస్ కు కీలక నేతలుగా ఉన్నారు. వీరు ఇద్దరిలో ఎవరికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా, మరొకరు ఆ అభ్యర్థికి మద్దతు ఇవ్వకుండా ఉన్న పరిస్థితి ఉంది. దీనివల్ల పార్టీ ఓడిపోయే అవకాశాలే ఎక్కువ. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని పెండింగ్ లో ఉంచింది.
అందుకే ఇబ్బందికరంగా ఉన్న ఈ స్థానాలకు సంబంధించి సర్వేల రిపోర్టులు తెప్పించుకుని, ఆ నియోజకవర్గాల నాయకుల ఎదుటే తుది నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా బీ ఫాం ఇవ్వని పటాన్ చెరు అభ్యర్థి విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై కేసీ వేణుగోపాల్ నేడు పలువురితో చర్చించినట్లు సమాచారం.
నేడు (నవంబర్ 9) కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్‌కి వచ్చిన వాతావరణమే తెలంగాణలోనూ కనిపిస్తుందని అన్నారు. తెలంగాణలో అవినీతి పాలనకు కాంగ్రెస్ చరమగీతం పాడబోతుందని అన్నారు. కాంగ్రెస్‌లో ఎలాంటి గ్రూపులు, గ్రూపు రాజకీయాలు లేవని, అందరూ కలిసికట్టుగా పని చేస్తున్నారని అన్నారు. 70 స్థానాలతో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపు విషయంలో ఎక్కడ ఇబ్బంది లేదని, పెండింగ్ స్థానాలను కూడా ప్రకటిస్తామని చెప్పారు.