Budget 2024: విద్యుత్ మీటర్లు పెట్టేందుకు మోదీతో కేసీఆర్ ఒప్పందం- హరీష్‌కు రేవంత్ కౌంటర్- రికార్డులు సరిచేయాలని స్పీకర్‌కు వినతి
Telangana: ప్రజలు వాతలు పెట్టిన బీఆర్‌ఎస్ బుద్దిరాలేదన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో మీటర్లు పెడతామని మోదీతో ఒప్పందం చేసుకొని వచ్చి ఇక్కడ తామేదో పోరాడామని కబుర్లు చెబుతున్నారని ఆరోపించారు.
Revanth Reddy Vs Harish Rao: తెలంగాణ బడ్జెట్ చర్చ సందర్భంగా ప్రభుత్వంపై హరీష్‌రావు చేసిన కామెంట్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. నోరు తెరిస్తే చాలు అబద్దాలతో రెచ్చిపోతున్నారని వాస్తవాలు తెలుసుకొని రికార్డులు సరిచేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
"హరీష్ రావు సభను సభ్యులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మోటార్లకు మీటర్ల విషయంలో వాళ్లేదో కేంద్రంతో నిలబడి కొట్లాడినట్లు మాట్లాడుతున్నeరు. ఇది అబద్ధం... వారి తప్పులను కప్పి పుచ్చుకోవడానికి సభలో బుకాయించడం సరికాదు. ఈ విషయంలో రికార్డులను సవరించాల్సిన అవసరం ఉంది.
మీటర్ల విషయంలో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సభ ముందు ప్రవేశపెడుతున్నా. ఆరు నెలల్లో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ వద్ద మీటర్లు బిగిస్తామని 4 జనవరి 2017న ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంపై అధికారులు అజయ్ మిశ్రా, రఘుమా రెడ్డి, ఏ.గోపాల్ రావు సంతకం పెట్టారు. మోదీ ప్రభుత్వంతో ఆనాడు ఆరు నెలల్లోగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్‌కు మీటర్లు బిగిస్తామని కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. సభలో నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్న హరీష్ రావు.. వారి హయాంలో జరిగిన ఒప్పందాలను చదువుకుని మాట్లాడాలి. అని రిక్వస్ట్ చేశారు.
అబద్ధాలతో హరీష్ రావు ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారన్నారు. ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే వారు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పారు. "ప్రజలు శిక్షించినా వాళ్ల ఆలోచన మారలేదు.. అదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును రూ.7వేల కోట్లకే తెగనమ్మారు. గొర్రెల స్కీం పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారు. గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. ఆడబిడ్డల సెంటిమెంట్ నూ దోపిడీకి ఉపయోగించుకున్నారు. కురుమ, యాదవుల సోదరులను అమాయకులను చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. కాళేశ్వరం ఖర్చు విషయంలోనూ గతంలో ఒకటి చెప్పి...ఇప్పుడు రూ.94వేల కోట్లు అని చెబుతున్నారు. ఆని పైర్ అయ్యారు.
తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని భూములు అమ్మిందో లెక్కలు తీద్దామా అని సవాల్ చేశారు. "మీరు ఎన్ని వేల కోట్ల విలువైన భూములు అమ్మిర్రో లెక్క తీద్దాం. అప్పుల లెక్కలు చెబుతున్నారు... కానీ అమ్ముకున్న లెక్కలు చెప్పడంలేదు. పదేళ్లయినా పాలమూరుకు చేసిందేం లేదు. 20లక్షల కోట్లకు పైగా ఖర్చుపెట్టినా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం వీళ్లు కాదా? రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చారు. గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా... రంగారెడ్డి జిల్లాపై నిర్లక్ష్యం వహించారు. రంగారెడ్డి జిల్లా ఆస్తులు అమ్ముకున్నారు కానీ జిల్లాకు సాగు నీరు ఇవ్వలేదు. ప్రజలు బీఆరెస్ కు గుండుసున్నా ఇచ్చినా బుద్ధి మారకుండా ఇలా మాట్లాడటం సరైంది కాదు. అని రేవంత్ సూచించారు.
బీఆర్‌ఎస్ నిజాయితీ పాలన అందించి ఉంటే... బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్, గొర్రెల పంపిణీ పై విచారణకు సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పాలని సవాల్ చేశారు రేవంత్ రెడ్డి.