Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
Telangana Urban Development టీడీఆర్ వినియోగంతో పాటు అదనపు అంతస్తుల నిర్మాణం (High rise Buildings), సెట్ బ్యాక్‌ల్లో తెలంగాణ ప్రభుత్వం మినహాయింపులు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్మాణ రంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (TDR) వినియోగం ద్వారా అదనపు అంతస్తుల నిర్మాణానికి, సెట్‌బ్యాక్‌లలో మినహాయింపులకు వీలు కల్పిస్తూ భవన నిర్మాణ నిబంధనలు-2012లో సవరణలు చేసింది. ఇప్పటివరకు 18 మీటర్ల ఎత్తు వరకు ఉన్న భవనాలను మాత్రమే సాధారణ భవనాలుగా పరిగణించగా, ఇకపై ఆ పరిమితిని 21 మీటర్లకు పెంచింది. అంటే 21 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలను మాత్రమే హైరైజ్ బిల్డింగ్స్ (High-rise Buildings)గా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెట్రోపాలిటన్ ఏరియా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
అదనపు అంతస్తులు, ప్లాటు విస్తీర్ణం
గతంలో 1000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటేనే జీ+5 (18 మీటర్లు) అంతస్తుల వరకు అనుమతి ఉండేది. తాజా సవరణల ప్రకారం, ప్లాటు కనీస విస్తీర్ణాన్ని 750 చదరపు మీటర్లకు తగ్గించారు. ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) వినియోగించడం ద్వారా 750 నుండి 2000 చదరపు మీటర్ల ప్లాటులో 21 మీటర్ల ఎత్తు (జీ+6 అంతస్తులు) వరకు నిర్మించుకోవచ్చు. 2000 చ.మీ. కంటే ఎక్కువ స్థలం ఉండి, రోడ్డు వెడల్పు 40 అడుగుల కంటే ఎక్కువ ఉంటే, జీ+5 అంతస్తులకు అదనంగా మరో 3 అంతస్తులు కట్టుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రోడ్డు వెడల్పు 60 అడుగులు ఉంటే కనుక అదనంగా 4 అంతస్తులు, 80 అడుగులు ఉంటే 5 అదనపు ఫ్లోర్‌ల నిర్మాణానికి అనుమతి లభిస్తుంది.
సెట్‌బ్యాక్ మినహాయింపులు, నిబంధనలు
టీడీఆర్ వినియోగించే హైరైజ్ బిల్డింగ్‌లకు కనీస సెట్‌బ్యాక్ (ఇంటి ముందు, చుట్టుపక్కల విడిచిపెట్టే ఖాళీ స్థలం)లో 10 శాతం మినహాయింపు ఇచ్చారు, అయితే బిల్డింగ్ చుట్టూ కనీసం 7 మీటర్ల ఖాళీ స్థలం ఉండాలని నిబంధన పెట్టింది. సాధారణ మల్టీ స్టోరేజీ బిల్డింగ్‌లకు కూడా సెట్‌బ్యాక్‌లలో మినహాయింపులు వర్తిస్తాయి. అలాగే, మాస్టర్ ప్లాన్‌లోని రోడ్లను సవరించినప్పుడు లేదా తొలగించినప్పుడు దానికి సమానమైన ఛార్జీలు లేదా టీడీఆర్ చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఇతర అన్ని నిబంధనలు పాటించాలి.
బిల్డింగ్ 10 ఫ్లోర్లు దాటితే కొత్త రూల్స్
కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో నిర్మించే వాటిలో 10 అంతస్తులు దాటిన బిల్డింగ్‌లకు టీడీఆర్ వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. 10 నుండి 20 అంతస్తుల వరకు నిర్మిత స్థలంలో 3 శాతం, 20 అంతస్తులు దాటితే 5 శాతం TDRను వినియోగించాలి. నిర్మాణం కోసం అప్లికేషన్ సమయంలో 50 శాతం, నివాస యోగ్యత పత్రం (Occupancy Certificate) తీసుకునే సమయంలో మిగిలిన 50 శాతం టీడీఆర్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
టీడీఆర్ అంటే ఏమిటి?
రోడ్డు విస్తరణ, చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం (FTL), బఫర్ జోన్ల వంటి పనుల కోసం భూమిని కోల్పోయిన యజమానులకు ప్రభుత్వం పరిహారంగా టీడీఆర్(TDR)ను జారీ చేస్తుంది. ఈ హక్కులను టీడీఆర్ బ్యాంకులో పేర్కొంటారు. బిల్డర్లు లేదా వ్యక్తులు వీటిని కొనుగోలు చేసి, తమ నిర్మాణాలలో అదనపు అంతస్తులు లేదా సెట్‌బ్యాక్ మినహాయింపుల కోసం ఉపయోగించుకోవచ్చు. ఎఫ్‌టీఎల్, గరిష్ట వరద మట్టం, నాలాల బఫర్ జోన్లు పరిధిలోకి వచ్చే భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే సమయంలో ఈ టీడీఆర్‌లను జారీ చేస్తుందని తెలిసిందే.
Before You Go
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
ట్రెండింగ్ వార్తలు






















