Swadeshi Vidya Nidhi: ఇతర రాష్ట్రాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్, వచ్చే ఏడాది నుంచి స్వదేశీ విద్యానిధి అమలు
Swadeshi Vidya Nidhi: ఇతర రాష్ట్రాల్లో చదువుకునే తెలంగాణ బీసీ విద్యార్థులకు స్వదేశీ విద్యానిధి పథకాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నారు.
Swadeshi Vidya Nidhi: ఇతర రాష్ట్రాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలె ప్రకటించిన బీసీ విద్యార్థుల స్వదేశీ విద్యానిధి పథకాన్ని 2023-24 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా 200లకు పైగా విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన ప్రతిభావంతులైన బీసీ విద్యార్థుల ఫీజును సర్కారే చెల్లించనుంది.
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఐఐఎం, ఏఐఐఎంఎస్, నిట్, బిట్స్ తదితర ప్రతిష్ఠాత్మకమైన విద్యా సంస్థల్లో చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే ట్యూషన్ ఫీజులు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. అదే తరహాలో దేశంలోని అలాంటి విద్యాసంస్థల్లో చదువుకునే బీసీ విద్యార్థులకూ ట్యూషన్ ఫీజు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలె నిర్ణయించింది. ఈ ఏడాది కేంద్ర విద్యాశాఖ రూపొందించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ లోని టాప్ 200 విద్యా సంస్థల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఈ స్వదేశీ విద్యానిధి పథకానికి అర్హులను పేర్కొంది. ఆయా విద్యా సంస్థల్లో చదువుకునే ఒక్కో బీసీ విద్యార్థికి సంవత్సరానికి గరిష్ఠంగా రూ.2 లక్షల ఫీజు చొప్పున, సంబంధిత కోర్సు ముగిసే వరకూ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది.
బీసీ విద్యార్థులకు స్వదేశీ విద్యానిధి పథకం అమలు చేయాలన్న నిర్ణయాన్ని బీసీ సంఘాలు, విద్యార్థులు స్వాగతించాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపట్ల హర్షం వ్యక్తం చేశాయి. రాష్ట్ర సర్కారు తాజా నిర్ణయంతో ప్రతి సంవత్సరం రాష్ట్రానికి చెందిన సుమారు 5 వేల నుంచి 10వేల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వివిధ బీసీ సంఘాల నేతలు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎంతో మంది బీసీ బిడ్డలకు ఉన్నత విద్యావకాశాలు దక్కనున్నాయని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్నారని, బీసీల విద్యాప్రదాతగా నిలిచారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే ఆశయాలను సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నరాని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని బీసీ విద్యార్థులు దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదువుకునేందుకు సర్కారు ఫీజు చెల్లించే పథకం తీసుకురావడమే అందుకు నిదర్శనమని అన్నారు. నేడు ఎంతో మంది పేద విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆశయాలు, కలలు నెరవేర్చుకునే అవకాశం లభించినట్లు పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా బీసీల విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు.
బీసీ బిడ్డల కలల సాకారానికి అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు యావత్ బీసీ సమాజం రుణపడి ఉంటుందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దండ్రు కుమారస్వామి కొనియాడారు. స్వదేశీ విద్యానిధి పథకానికి రూపకల్పన చేయడం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా వేలాది మంది బీసీ విద్యార్థులు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చేరి ఉన్నత విద్యను అభ్యసించే గొప్ప అవవకాశం దక్కుతుందని చెప్పారు.