V Rama Subramaniyan: తెలంగాణలో ఎన్నికలు జ్యోతిష్యం ప్రకారం వస్తాయి- సుప్రీంకోర్టు న్యాయమూర్తి కామెంట్స్
V Rama Subramaniyan: తెలంగాణలో ఎన్నికలు జ్యోతిష్యం ప్రకారం వస్తాయని సుప్రీం కోర్డు జడ్డి జస్టిస్ వి రామ సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. ఆయన ఎందుకు ఇలా మాట్లాడారంటే..?
V Rama Subramaniyan: తెలంగాణలో ఎన్నికలు జ్యోతిష్యం ప్రకారం వస్తాయని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి రామ సుబ్రమణియన్ అన్నారు. 2018 ఎన్నికలో గోషామహల్ నియోజక వర్గం నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ అఫిడవిట్ లో క్రిమినల్ కేసుల వివరాలను పూర్తిగా పొందుపరచలేదని, ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ఎస్ నేత ప్రేమ్ సింగ్ రాథోడ్ దాఖలు చేసిన పిటిషన్ వేశారు. దీనిపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్ జస్టిస్ ఎస్. రీవంద్ర భట్, జస్టిస్ వి.రామ సుబ్రమణియన్ లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ఇది 2018 ఎన్నికల నాటి పిటిషన్ అని, మరికొన్ని వివరాల సమర్పణకు మూడు వారాల సమయం కావాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే జోక్యం చేసుకున్న జస్టిస్ వి.రామ సుబ్రమణియన్.. తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం 2018లో ముందస్తుగా ఎన్నికలు వచ్చాయి. అలాగే ఈ కేసు విచారణకూ గ్రహాలన్నీ ఒకే వరుసలోకి రావాలి కావచ్చ అంటూ కామెంట్లు చేశారు. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేశారు.
ఇటీవలే విడుదలైన రాజాసింగ్
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ను ఎత్తివేస్తూ ఇటీవలే హైకోర్టు నిర్ణయం తీసుకుంది. పీడీ యాక్ట్‌పై తన భర్తను అక్రమంగా జైల్లో నిర్బంధించారని రాజాసింగ్ భార్య హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయనపై పీడీ యాక్ట్‌ను క్వాష్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే పలు రకాల షరతులను విధించింది. మీడియాతో మాట్లాడటం, ర్యాలీల్లో పాల్గొనడం.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని హైకోర్టు షరతు విధించింది.
మునావర్ ఫారుఖీ షోకు వ్యతిరేకంగా వివాదాస్పద వీడియో రిలీజ్ చేసిన రాజాసింగ్
హైదరాబాద్‌లో మునావర్ ఫారుఖీ అనే స్టాండప్ కమెడియన్ షో అనుమతి రద్దు చేయాలని రాజాసింగ్ పోరాటం చేశారు. ఆయన హిందువుల్ని కించ పరిచారని ఆరోపించారు. అయితే షో యధావిధిగా నడిచింది. దానికి కౌంటర్‌గా రాజాసింగ్.. ఓ వర్గాన్ని కించపరిచే విధంగా వీడియో చేసి యూట్యూబ్‌లో పెట్టారు. ఈ అంశం తీవ్ర వివాదాస్పదమయింది. పోలీసులు మొదట కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అయితే కోర్టు రిమాండ్‌కు పంపకుండానే బెయిల్ ఇచ్చింది. తర్వాత పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. ఆగస్టు 25న రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేశారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. ఈ మధ్య విడుదల అయ్యారు.
సస్పెండ్ చేసిన బీజేపీ
వివాదాస్పద కామెంట్స్ కారణంగా జైలుకు వెళ్లిన రాజాసింగ్‌ను సొంత పార్టీ బీజేపీ కూడా సస్పెండ్ చేసింది. ఆ తర్వాత పార్టీ నుంచి బహిష్కరించకుండా ఉండటానికి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు రాజాసింగ్ జైలు నుంచే వివరణ పంపారు. తర్వాత తాను ఏ తప్పూ చేయలేదని వివరణ కూడా ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆయనపై చర్యలు తీసుకోవడం కానీ, సస్పెన్షన్ రద్దు చేయడం కానీ జరగలేదు.