News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Sirivennela Sitarama Sastry: సీతారాముడూ.. నిన్ను గుర్తు చేసుకుంటూ బతికేస్తాం, పోయిరా నేస్తం.!

సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంతిమ సంస్కారాలు జూబ్లీహిల్స్ సమీపంలోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో జరిగాయి. తెలుగు సినీ మజిలీలో ఓ సాహిత్య మేరు శిఖర ప్రస్థానం ముగిసింది.

FOLLOW US: 
Share:

నువ్వు కేవలం సినిమా కవివా...ఒకవేళ అవునంటే నువ్వు మాకు గుర్తుండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేం చాలా మందిని మరిచిపోయాం.
మాకుండే హడావిడి జీవితంలో ఓ రెండొందలు ఇచ్చి చూసే రెండున్నర గంటల సినిమాలో నీకుండే స్పేస్ మహా అయితే ఐదు నిమిషాలు..
మరి ఆ స్పేస్ లో మా కోసం ఇంత చేశావంటే....సినిమా కవి అనే పరిధిని ఎప్పుడో దాటిపోయావ్. మా అనుమతి లేకుండానే మా జీవితాల్లోకి వచ్చావ్. ఓ ఫ్రెండ్ లా, ఓ గైడ్ లా...ఓ మెంటార్ లా ఉంటూ....లిరిసిస్ట్ ప్రహరీని దాటొచ్చి మాతో కలిసి ఇన్నాళ్లూ ప్రయాణం చేశావ్. నువ్వు ధైర్యం చెప్పిన మాటలు....కళ్లు తుడిచిన సందర్భాలు...ఒకటా రెండా. నీకున్న భాషా పరిజ్ఞానం...అపార అనుభవ సారాన్ని మా ముందు ఎన్నో సార్లు పెట్టాలని ప్రయత్నించావ్. కొన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. కొన్ని ఎప్పటికీ మాకర్థం కావని వదిలేశామ్. మరికొన్ని మా అనుభవాల్లో కి వచ్చినప్పుడు .....అరె నిజమే కదా ఆయనో ఎప్పుడో రాశాడు మన మట్టి బుర్రలకే అర్థం కాలేదు అని అనుకున్నాం. తప్పు మాదే. 

నీతో గడిపిన సందర్భాలు ఒకటో రెండో అయితే...ఇదిగో ఇది అని చెప్పొచ్చు. కానీ నేర్చుకునే కొద్దీ మరో పాఠం మరో పాఠం జతచేస్తూ నువ్వు చేసిన మూడువేల పాటల ప్రయాణం అందుకోవటానికి మాకు పట్టే సమయం జీవిత కాలం కంటే ఎక్కువ. అస్సలు నీ వయస్సెంత....మరి ఎలా ఓ ఇరవై ఏళ్ల కుర్రాడి నుంచి ఎనభై ఏళ్ల ముసలాడి దాకా కాలంలో ప్రయాణం చేయలగలవ్. వాళ్ల భావాలను నీ ఊహలతో అధిరోహించి ఎలా మా కళ్ల ముందు పెట్టగలవ్. సరే కొన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ జానూ సినిమాలో ఏమన్నావ్. 
ఏ దారెదురైన ఎటువెలుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవాహిస్తూ పోతున్నా.
ఏం చూస్తూ ఉన్నా నె వెతికానా ఏదైనా
ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా....అసలు బీయింగ్ అబ్జర్వర్ కాన్సెప్ట్ కి ఇంతకంటే ఉదాహరణ ఉంటుందా. నక్షత్ర మండలాలు పేలటం దగ్గర నుంచి పొరపాటున ఏర్పడిన భూమ్మీద ....మనుషులు కులాలు మతాల రొచ్చులో కుమ్ముకు చావటం వరకూ ఇక్కడ ఇన్ని జరుగుతుంటే....అంత సింపుల్ గా ఓ భగ్న ప్రేమికుడి వంకతో ఎందుకింత పెద్దపదాలు మా వదిలావ్.

ఉదయం కాగానే, తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనదా
అనగనగా అంటూ నే ఉంటా, ఎపుడు పూర్తవనే అవక
తుది లేని కథ నేనుగా. నిజంగా చెబుతున్నా..ఇది ఇక్కడే ఆపేయాలనిపిస్తోంది. ప్రతీ జీవితం అసంపూర్ణమే...కొన్నిజీవితాలు మాత్రమే నీలా వెలుగుతాయి. ఆ వెలుగులు మిగిలిన వాళ్లకు జీవితకాలం దారి చూపిస్తాయి. కష్టాల మండుటెండలో సిరివెన్నెల కురిపిస్తాయి. ఆ సిరివెన్నెల కోసం నువ్వు ఎన్ని రాత్రులు నరకం అనుభవించి ఉంటావో... అక్షరాలు పుట్టే ఆ ప్రసవ వేదన ఆ సృష్టికర్తలకైనా తెలుసో లేదో. మా కోసం ఇంత చేశావ్.

గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక
కాలు నిలవదు యే చోటా
నిలకడగ
యే.... చిరునామా లేక
యే బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక.... మౌనంగా
నీకేంటి రాసేశావ్.... బదులు పొందని లేఖ... మౌనంగా కేక వేస్తోందని. మరి నువ్వొదిలి వెళ్లిపోయావ్ అని ఏర్పడిన మా మౌనానికి ఏం తెలుసు ఎలా కేక వేయాలో. మౌనంగా ఏడవటం తప్ప.

కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే, జనాలు తలలర్పిస్తారే
సమూహక్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే
సీతారాముడు ఏంటయ్యా నీ ప్రశ్నలు....ఎంత అమాయకుడివయ్యా నిజంగా. అర్ధశతాబ్దం కాదు శతాబ్దం ట్రావెల్ చేసినా మా అజ్ఞానం ఇంతే....మా స్వతంత్రం ఇంతే. కనీసం నిన్నటిదాకా నువ్వన్నా వున్నావ్ అడగటానికి. ఇక ఎవరు అడుగుతారు.

గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి..
గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి..
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం..
ఏ క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం…
-రామబాణమార్పిందా రావణ కాష్ఠం..
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం..
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని..
మారదు లోకం.. మారదు కాలం....


జల్సా ఓ కమర్షియల్ సినిమా స్వామీ...అందులోనూ నీకిచ్చింది ఓ సరదా ఆంగ్లపదాల పాట...నువ్వు సైలెంట్ గా ఏంరాశావ్
పొందాలంటే విక్టరీ...పోరాటం కంపల్సరీ
రిస్క్ అంటే ఎల్లా మరీ...బోలో....ఓఓఓఓ
ఎక్కాలంటే హిమగిరి...ధిక్కారం తప్పనిసరి
కాలం మొక్కే హిస్టరీ లిఖ్ నా హహహహహ
Utophia ఊహలో అటో ఇటో సాగుదాం
Euphoria ఊపులో ఎగసిఎగసి చెలరేగుదాం
Philosophy చూపులో ప్రపంచమో బూటకం
Anatomy ల్యాబులో మనకు మనం దొరకం....యూటోపియా అంటే ఓ ఫీలింగ్ ఆర్ స్టేట్ ఎక్కడ అంతా ఫర్ ఫెక్ట్ గా ఉంటుందో అలాంటి ప్లేస్ అన్నమాట.
యుఫోరియా అంటే అది కూడా ఓ ఫీలింగ్ ఆర్ స్టేట్ ఎక్కడ సుఖసంతోషాలు మాత్రమే ఉంటాయో అలాంటి ప్లేస్. మరి ఓ తెలుగు సినిమా
లో అందునా కమర్షియల్ పాటలో....ఇంత అర్థాన్ని...రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి ఎసెన్స్ ని తీసుకురావటం అసలు ఎందుకంత కష్టం నీకు సీతారాముడు. బహుశా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి తప్ప ఆ సమయంలో నీ తపన ఎవరికైనా అర్థమైందో లేదో.


మళ్లీ అదే సినిమాలో
అపుడెపుడో ఆటవికం మరి ఇపుడో ఆధునికం
యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం
రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం
రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంత ముఖం
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్ ..ఇలా బతుకుతున్నాం ఇది కాదు రా బాబూ జిందగీ  అని మమ్మల్ని కార్యోన్ముఖులను చేసింది నువ్వే గా.

సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ
సుఖాన మనలేని వికాసమెందుకనీ
నిజాన్ని బలికోరే సమాజమెందుకనీ
అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం
ఈ ఒక్క పాట రాసి...ఆర్జీవీ లాంటి మొండి ఘటంలోనూ ఓ ఆలోచన రేకెత్తించి గాయం అనే సినిమా తీయాలని ఆలోచనిచ్చావే
విధాత తలపున ప్రభవించినదీ అనాది జీవన వేదం అని నువ్వే రాసుకున్న అక్షరాలకి నువ్వే ఓ ఉదాహరణ కాదా...

మళ్లీ అదే సిరివెన్నెలలోనే
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది అంటూ ఆదిభిక్షువును అడ్డం పెట్టుకుని నీ భవిష్యత్
ముందే చెప్పావ్ కదా...నిజం చెప్పు.

ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాకే ఉన్నాయి నేను తెగ దిగులు పడిపోతున్నప్పుడు
మరీ అంతగా మహా చింత గ మొహం ముడుచుకోకలా
పనేం తోచక పారేశాను గ గడబిడ పడకు ఆలా
మత్తోయేంతగా శ్రుతీ పెంచగా విచారాల విల విల
సరే చాలిగా ఆలా జాలిగా తిక మక పెడితే ఎలా
కన్నీరై కురవాలా మన చుట్టూ ఉండే లోకం తడిసేలా
ముస్తాబే చెదారాల నిను చూడాలంటే అద్దం జడిసేల
ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మారేందుకు గోల
అయ్యయ్యో పాపం అంటే ఎదో లాభం వస్తుందా
వృధా ప్రయాస పడాల అని రాశావ్ కదా....థాంక్యూ ఏం చెప్పగలం ఇంతకన్నా.


ఓటమి నన్ను వెక్కిరించినప్పుడు
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అన్నావు.
మళ్లీ నువ్వే.....
మండే కొలిమినడగందే
తెలియదే మన్నుకాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెబుతుందే
పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై
దరిజేరె ప్రియురాలే గెలుపంటె
తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానై
అడగక దొరికే వరమే వలపంటే అని గెలుపు కోసం ఎంత ప్రోసెస్ జరగాలో విడమరిచి చెప్పి
వెన్నుతట్టావ్.


ఇంత జరిగీ అసలేంటి ఈ జీవితం...దీనికంటూ ఓ అర్థం ఉందా కూర్చున్నప్పుడు
ఎంత వరకు ఎందుకొరకు
వింత పరుగు అని అడగకు
గమనమే నీ గమ్యమైతే

బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే
గుర్తుపట్టే గుండెనడుగు

ప్రపంచం నీలో ఉన్నదని
చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా
కలిస్తే ప్రతీచోటా నిను నువ్వే
కలుసుకొని పలకరించుకోవా అంటూ 750 కోట్ల ప్రపంచజనాభాకి వాళ్ల బతుక్కి ఓ అర్థం చెప్పావ్.
ఈ పాటకి అర్థం తెలుసుకుంటే చాలు...ఏ ప్రపంచ యుద్ధాలు ఇకరావు సీతారాముడూ నిజంగా.

మరి మాకు ఇన్ని చేసి..ఇంత విలువైన పాటల ఆస్తినిచ్చి ఎక్కడికి వెళ్లిపోయావ్ అంటే
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అప్పుడో ఇప్పుడు కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదె విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక వుంటుందా
బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరపడిన పడినా జలిపడదె కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదె నువ్వొచ్చేదాకా...

సీతారావుడూ...వెళ్లిరా...మీ అన్నయ్య బాలు నీకోసం వేచి చూస్తున్నాడు
నువ్వు రాయి...ఆయన పాడతాడు....స్వర్గానికి మరో కొత్త స్వర్గం పరిచయం చేయండి.
నువ్విచ్చిన ధైర్యంతో....నీ మాటలు ఇచ్చిన ప్రోత్సాహంతో....జీవితంలో ప్రతీ మజిలీలోనూ
నిన్ను గుర్తు చేసుకుంటూ బతికేస్తాం. పోయిరా నేస్తం.!

Published at : 01 Dec 2021 01:41 PM (IST) Tags: Abp desam News Sirivennela Sitarama Sastry Sirivennela Songs Sitarama Sastry death Sirivennela Sitarama Sastry News

ఇవి కూడా చూడండి

TS LAWCET: టీఎస్‌ లాసెట్ - 2023 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్య తేదీలివే!

TS LAWCET: టీఎస్‌ లాసెట్ - 2023 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్య తేదీలివే!

గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై అస్పష్టత, షెడ్యూలు ప్రకారం జరిగేనా?

గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై అస్పష్టత, షెడ్యూలు ప్రకారం జరిగేనా?

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Minister Komatireddy: ఆర్&బీ మంత్రిగా కోమటిరెడ్డి బాధ్యతలు - మాజీ మంత్రి హరీశ్ రావుకు కౌంటర్

Minister Komatireddy: ఆర్&బీ మంత్రిగా కోమటిరెడ్డి బాధ్యతలు - మాజీ మంత్రి హరీశ్ రావుకు కౌంటర్

Sirpur Kagaznagar Train: సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ట్రైన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం - కోచ్‌ నుంచి పొగలు

Sirpur Kagaznagar Train: సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ట్రైన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం - కోచ్‌ నుంచి పొగలు

టాప్ స్టోరీస్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Smartphone Prices: ప్లీజ్... రేట్లు తగ్గించండి - స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మొబైల్ రిటైలర్ల లెటర్!

Smartphone Prices: ప్లీజ్... రేట్లు తగ్గించండి - స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మొబైల్ రిటైలర్ల లెటర్!

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!