Revanth Reddy: భవిష్యత్తులో ఒలింపిక్స్ వేదికగా హైదరాబాద్ మారాలి- అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి
Telangana News | తెలంగాణను దేశ స్పోర్ట్స్ కు కేంద్ర బిందువుగా మార్చాలని, భవిష్యత్తులో హైదరాబాద్ లో ఒలింపిక్స్ నిర్వహించేలా ప్లాన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
Young India Sports University | హైదరాబాద్: దేశంలో క్రీడలకు కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో భేటీలో భాగంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ (Sports university)పై వారితో చర్చించారు. ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎలా ఉండాలన్న దానిపై సూచనలు చేశారు. ప్రతి క్రీడకు ప్రాధాన్యం ఉండాలని, క్రీడా శిక్షణ సంస్థలను, అన్ని రకాల క్రీడలను ఒకే గొడుగు కిందకు తేవడమే స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితులు, మనకు అనువైన క్రీడల్ని గుర్తించి, స్పోర్ట్స్ పై ఉత్సాహం ఉన్న వారిని ప్రోత్సహించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దశాబ్దాల క్రితమే ఆఫ్రో- ఏషియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్‌కు హైదరాబాద్ ఆతిథ్యమిచ్చింది. హైదరాబాద్ ను భవిష్యత్తులో ఒలింపిక్స్‌కు వేదికగా మార్చాలని, ఒలింపిక్స్ నిర్వహించడంతో పాటు మన క్రీడాకారులకు పతకాలు దక్కేలా శిక్షణ ఇవ్వాలన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో...
స్పోర్ట్స్ యూనివర్సిటీ పరిధిలోకి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోని క్రీడా విభాగాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్పోర్ట్ స్కూల్స్, అకాడమీలు, స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీలను తీసుకురావాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, అర్చరీ, జావెలిన్ త్రో, హాకీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వీటి తరువాత ఒలింపిక్స్ లో మరిన్ని పతకాలు సాధించే ఛాన్స్ ఉన్న గేమ్స్ లో ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇప్పించాలని సూచించారు. గేమ్స్ ట్రైనింగ్ సహా అవసరమైన వసతులు, ఆహారంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దాలని రేవంత్ ఆదేశించారు.
ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో స్పోర్ట్స్ స్కూల్
ఆసక్తి ఉన్నవారికి ఆటల్లో ట్రైనింగ్ ఇచ్చేలా ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని చర్చించారు. చిన్నప్పటి నుంచే విద్యార్థులకు ఆటల్లో శిక్షణ ఇచ్చి, ఇటువైపు కెరీర్ గా మలుచుకునేలా చూడాలన్నారు. మిగతా పాఠశాలల్లో విద్యా బోధన ఉంటుందని, ఈ స్కూల్స్ లో క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి, టాలెంట్ ఉన్న వారికి శిక్షణ ఇచ్చి, టాలెంట్ ఆధారంగా వారికి స్పోర్ట్స్ యూనివర్సిటీలో వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఒలింపిక్స్ విజేతలపై సమగ్ర అధ్యయనం....
ఇటీవల ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారుల వివరాలు సేకరించి, పతకాల సాధించేందుకు వారు శ్రమించిన తీరు వివరాలను సేకరించి, సమగ్ర అధ్యయనం చేయాలన్నారు. దేశ క్రీడా రంగానికి హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ యూనివర్సిటీ కేంద్ర బిందువుగా ఉండాలని, అందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ (Skill University)కి యంగ్ ఇండియా పేరు పెట్టామని, స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా పేరు ఖరారు చేసినట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు యంగ్ ఇండియా పేరు పెడతామని చెప్పారు. తెలంగాణ యంగ్ ఇండియాకు బ్రాండ్‌గా మారాలని, నైపుణ్యాల్లో తెలంగాణ ఒక శక్తిమంతమైన రాష్ట్రంగా గుర్తింపు పొందడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.