Revanth Challenges KCR: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చి, గజ్వేల్ నుంచి బరిలోకి దిగు: కేసీఆర్ కు రేవంత్ సవాల్
Revanth Challenges Telangana CM KCR: బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడంతో పాటు గజ్వేల్ నుంచి మరోసారి బరిలోకి దిగాలని సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
Revanth Reddy Challenges Telangana CM KCR: వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుని ఉంటే సీతక్కలాంటి ఎమ్మెల్యేలు కన్నీరు పెట్టాల్సి వచ్చేది కాదు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభలో శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే మంత్రులు అడ్డుకుంటున్నారని చెప్పారు. వరదబాధిత ప్రాంతాల్లో తిరగాల్సిన బీఆరెస్ ఎమ్మెల్యేలు రౌడీల్లా వీధుల్లో తిరుగుతున్నారు. వరద బాధితులకు నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఎవరైనా అడ్డుకున్నారా? రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయిందా? మున్సిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారా? రాష్ట్రంలో మంత్రులు లేరా? అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ చుట్టుపక్కల కేసీఆర్ కుటుంబం 10వేల ఎకరాలు కబ్జా చేశారు.. లక్ష కోట్లు వెనకేసుకున్నారు అని ఆరోపించారు. త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంది. కేసీఆర్ కు తెలంగాణతో రుణం తీరిపోయిందని, ఆయనకు తెలంగాణకు మోజు తీరిందన్నారు. అందుకే రాష్ట్రంలో వరద ప్రాంతాల్లో పర్యటించకుండా... సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్ళారని ఆరోపించారు. మహారాష్ట్రలో పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ తెలంగాణ రైతులపై లేదని, మన క్షేమం పట్టని కేసీఆర్ మనకు అవసరమా? అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్..
పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డి దేవుడి మాన్యాలను వదలడం లేదని, ఈసారి మనోహర్ రెడ్డిని ఆ దేవుడు కూడా కాపాడలేడు అన్నారు. పార్టీ జెండా మోసినవారిని కాంగ్రెస్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని, మీకోసం మేముంటాం.. మాకోసం మీరు ఉండండి అని ప్రజలను కోరారు.
తెలంగాణను నిజంగానే బంగారు తెలంగాణ చేసుంటే సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. అదేవిధంగా గజ్వేల్ నుంచి కేసీఆర్ ను పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. రాక్షసులందరినీ పుట్టించిన బ్రహ్మరాక్షసుడు కేసీఆర్ అని, బ్రహ్మరాక్షసుడికి మందు పెట్టి బొంద పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ధర్మయుద్ధం చేయాల్సిన సమయం వచ్చేసిందని, ఈ యుద్ధంలో గెలిచేది కాంగ్రెస్సే అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్త తీసుకోవాలని పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన పాము - అసెంబ్లీలో మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయిందని, Expiry Date దాటిపోయిన మెడిసిన్ అని చచ్చిపోయిన పాములాంటిదన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు కాంగ్రెస్ కోరలు తీసేశారని, కానీ వాళ్లు ఏదో ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పక్కింట్లో పెళ్లిఅయితే ఇంట్లో హడావుడిలాగ.. కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలను చూసి తెలంగాణలో ఆ పార్టీ నేతలు హంగామా చేస్తున్నారని చెప్పారు. కర్ణాటకలో ఏదో జరిగిందని చూసి, భట్టి, శ్రీధర్ రెడ్డి మరికొందరు నేతలు తమకు పదవులు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సీతక్క సీఎం అని ఒకాయన చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అయితే సీతక్క సీఎం ఏంది, ఇది పెద్ద జోక్ అన్నారని గుర్తుచేశారు. మూడు, నాలుగు నెలల్లో అధికారంలోకి వస్తారు కదా, ఆరోజు పదవులు తేల్చుకోవాలన్నారు.