Rail Coach Restaurant: హైదరాబాద్‌లో 'రైల్ కోచ్ రెస్టారెంట్'-ఫుడ్ లవర్స్‌కు పసందైన రుచులు
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో రైల్ కోచ్ రెస్టారెంట్‌ను ప్రారంభించింది దక్షిణ మధ్య రైల్వే. ఫుడ్ లవర్స్‌కు పసందైన రుచులను అందిస్తోంది. వినూత్న అనుభూతులతో టెస్టే ఫుడ్‌ను ఆశ్వాదించమని ఆహ్వానిస్తోంది.
చుక్ చుక్ మంటూ వెళ్లే రైలు... రెస్టారెంట్‌గా మారింది. భోజన ప్రియులకు పసందైన రుచులను వండి వడ్డిస్తోంది. రుచికరమైన వంటకాల కోసం... రైలు కోచ్ రెస్టారెంట్‌లోకి చకాచకా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఫుడ్ లవర్స్.. ఆ రైల్ రెస్టారెంట్ ఎక్కడుంది..? ఎలా ఉందో... మీకు తెలుసా?
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని రైల్వేస్టేషన్ ఆవరణలో ఈ రైలు రెస్టారెంట్‌ను ప్రారంభించింది దక్షిణ మధ్య రైల్వే. రైలు ప్రయాణీకులకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించడం కోసం... మరో అడుగు ముందుకేసింది. రైల్ కోచ్ రెస్టారెంట్‌ని ప్రారంభించి... సరికొత్త పద్ధతిలో భోజన ప్రియులకు ప్రత్యేకమైన భోజనాన్ని అందిస్తోంది. వినియోగంలో లేని పాత బోగీని రెస్టారెంట్ తరహాలో ఆధునికీకరించారు. కస్టమర్లకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా అన్ని హంగులతో రెస్టారెంట్‌లా తీర్చిదిద్దారు. చూసేందుకు మాత్రమే కాదు... రుచుల విషయంలోనూ ఆహా అనిపిస్తోంది ఈ రైల్ కోచ్ రెస్టారెంట్.
సాధారణంగా.. రైలులో అందించే భోజనం అంటే చాలా మందికి ఇష్టముండదు. రుచి పచి లేని ఆ తిండి తినలేక అవస్థలు పడుతుంటారు. కానీ... ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. ఈ రైల్ కోచ్ రెస్టాంట్‌లో ఫుడ్ కోసం భోజన ప్రియులు క్యూ కడతారని భావిస్తున్నారు. లొట్టలు వేసుకుని తినేందుకు రెడీ అయిపోయారు. ఈ రెస్టారెంట్ మెనూలో సుప్రసిద్ధ వంటకాలు ఎన్నో ఉన్నాయి. నగరానికి చెందిన బూమరాంగ్ రెస్టారెంట్‌కు ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. రైల్ కోచ్ రెస్టారెంట్‌లోకి వెళ్లిన వారికి.. పసందైన ఫుడ్ అందించడమే కాదు... ప్రత్యేకమైన అనుభావాలను కూడా అందిస్తోంది రైల్ కోచ్ రెస్టారెంట్. ఇది హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన రెండో రెస్టారెంట్.
కాచిగూడ రైల్వేస్టేషన్‌లోనూ ఇంతకుముందు ఓ రెస్టారెంట్ ప్రారంభించింది దక్షిణ మధ్య రైల్వే. దీనికి మంచి ఆదరణ వచ్చింది. ఇప్పుడు నెక్లెస్‌రెడ్‌లో ఏర్పాటు చేసిన రైల్ కోచ్ రెస్టారెంట్‌కు కూడా విశేష స్పందన లభిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ఆశిస్తోంది. చిరుతిళ్లు, అల్పాహారాలు, భోజనం, ఇతర రకాల వంటకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. పార్శిల్ సదుపాయం కూడా అందుబాటులోకి తేనున్నారు. ఇదే కాదు... హైదరాబాద్‌లోని రైల్వేస్టేషన్లలో దశలవారీగా ఇటువంటి రైల్ కోచ్ రెస్టారెంట్లను ఏర్పాటు చేయాలన్నది దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక.
హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక స్థలాల్లో నెక్లెస్ రోడ్ ఒకటి. రోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకుల అక్కడికి వెళ్తుంటారు. వీకెండ్‌లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఈ స్టేషన్ చుట్టుపక్కల... పర్యాటక ప్రదేశాలు ఉండటంతో.. రైల్‌కోచ్ రెస్టారెంట్‌కు తాకిడి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ రెస్టారెంట్ అత్యాధునికంగా ఉంటుంది.. మంచి అనుభూతిని కలిగిస్తుంది. రైలు ప్రయాణికులతో పాటు ప్రజలకు కూడా రెస్టారెంట్ అందుబాటులో ఉండనుంది. కోచ్‌లోనే కూర్చొని తినొచ్చు.. లేదంటే పార్శిల్ తీసుకెళ్లొచ్చు. ఇక రైల్ కోచ్ రెస్టారెంట్‌ను ఐదేళ్ల పాటు బూమ్‌రాంగ్ రెస్టారెంట్ నిర్వహించనుంది. ఈ వినూత్న సౌకర్యాన్ని రైలు ప్రయాణికులు, సామాన్య ప్రజలు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ విజ్ఞప్తి చేశారు.