12న తెలంగాణలో మోదీ పర్యటన- ఈసారైనా కేసీఆర్ పాల్గొంటారా?
ప్రధానమంత్రి పర్యటనలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. తెలంగాణలో పర్యటించనున్న ప్రధానికి ఎయిర్‌పోర్టుకు గవర్నర్‌తో వెళ్లి స్వాగతం పలకాల్సి ఉంటుంది.
నవంబర్ 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించి జాతికి అంకితం ఇస్తారు. మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై డీజేపీ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారుతో సీఎస్ సోమేశ్ కుమార్ చర్చించారు. మోదీ పర్యటనకు ఏర్పాట్లు చేయాలని, భద్రత విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
ప్రధానమంత్రి పర్యటనలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. తెలంగాణలో పర్యటించనున్న ప్రధానికి ఎయిర్‌పోర్టుకు గవర్నర్‌తో వెళ్లి స్వాగతం పలకాల్సి ఉంటుంది. గతంలో మూడుసార్లు మోదీ తెలంగాణకు రాగా సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు. ప్రభుత్వం తరఫునన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లి ప్రధానిని ఆహ్వానించారు. ఈసారైనా ప్రధాని పర్యటనలో కేసీఆర్ పాల్గొంటారా? లేక ఎప్పటిలాగే డుమ్మా కొడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ విస్తృత ఏర్పాట్లు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సభకు కనీవినీ ఎరగని రీతిలో భారీగా జన సమీకరణ చేసేందుకు సిద్ధమైంది. కనీసం లక్ష మందికి తగ్గకుండా బహిరంగ సభను విజయవంతం చేయాలని భావిస్తోంది. ప్రధాని వస్తున్న వేళ చేపట్టాల్సిన కార్యక్రమాలు, జన సమీకరణపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుజు బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ భేటీకి ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నేతలు హాజరయ్యారు.
జన సమీకరణ, సభ విజయవంతం చేసేలా జిల్లా నాయకులంతా సమన్వయంగా పనిచేయాలని లీడర్లకు బండి సంజయ్ సూచించారు. ప్రధానికి భారీ స్వాగతం పలికేలా తెలంగాణ అంతటా వివిధ రూపాల్లో అలంకరణ చేయాలన్నారు. అన్ని నియోజకవర్గాలు రైతులు, కార్యకర్తలు తరలివచ్చేలా ర్యాలీలు నిర్వహించాలని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు బండి సంజయ్. రూ.6120 కోట్ల వ్యయంతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్దరించడం వల్ల రైతులకు కలిగే ప్రయోజాలను వివరించాలన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్దరణ ద్వారా తెలంగాణ, ఏపీ సహా దక్షిణ భారత రైతులందరికీ కొరత లేకుండా ఎరువులను సరఫరా చేయబోతున్నామని... దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.
మోదీ ప్రభుత్వం రైతు ప్రయోజనాల విషయంలో రాజీ పడటం లేదన్నారు బండి. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ... ఆ భారం రైతులపై పడకూడదనే ఉద్దేశంతో ఏటా వేల కోట్లు ఖర్చు పెట్టి సబ్సిడీపై ఎరువులు అందిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
మునుగోడులో గెలుపు బీజేపీదే
మునుగోడు ఎన్నికల్లో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేశారని... ఒక్క ఉపఎన్నిక గెలిచాందుకు వెయ్యి కోట్లకుపైగా ఖర్చు చేశారన్నారు బండి. విచ్చల విడిగా మద్యం ఏరులై పారించారని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, పోలీస్ కమిషనర్, ఎస్పీ... టీఆర్ఎస్ తొత్తులుగా మారారని విమర్శించారు. ఏడేళ్లుగా ఒకే పోస్టింగ్‌లో ఉన్న పోలీస్ కమిషనర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్యకర్తల్లా పని చేశారన్నారు. నిజాయితీ, నిబద్ధతతో పని చేసే బీజేపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి కేసులు నమోదు చేశారన్నారు. ఇన్ని చేసినా ప్రజలు మనవైపే ఉన్నారని.... మునుగోడులో బీజేపీ విజయం ఖాయమని అభిప్రాయపడ్డారు.