KTR News: ప్రజాపాలన దరఖాస్తులపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
BRS News: ప్రజాపాలన దరఖాస్తులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాల కోసం స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తుల్లో...ప్రజలకు సంబంధించిన అంశాలున్నాయని అన్నారు.
Prajapalana Applications : ప్రజాపాలన దరఖాస్తులపై బీఆర్ఎస్ (Brs) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Ktr) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాల కోసం స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తుల్లో... ప్రజలకు సంబంధించిన అంశాలున్నాయని అన్నారు. దరఖాస్తుల్లోని సున్నితమైన వివరాలు సైబర్ కేటుగాళ్లకు చేరకుండా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. వివరాలు సైబర్ నేరగాళ్లకు చేరితే...డేటా మొత్తం దుర్వినియోగం అవుతుందని అన్నారు. ప్రజాపాలన దరఖాస్తులపై ట్వీట్ చేశారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని, సైబర్ క్రైమ్ చట్టం తయారీలో భాగస్వామిగా చెబుతున్నానని వెల్లడించారు.
ప్రభుత్వ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి
ప్రభుత్వ పథకాల కోసం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల విషయంలో ప్రభుత్వ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని కేటీఆర్ సూచించారు. సిబ్బంది అజాగ్రత్తపై రాష్ట్ర ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందని, అలసత్వం వహిస్తే సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరే ప్రమాదం ఉందని కేటీఆర్ హెచ్చరించారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో కోటి 25 లక్షల మంది సున్నితమైన వివరాలు ఉన్నాయని గుర్తు చేశారు. పింఛన్లు, ఆరు గ్యారంటీలు ఇస్తామంటూ...ఎవరైనా అడిగితే ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు చెప్పొద్దని కేటీఆర్ కోరారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినా, వేయక పోయినా...సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోవద్దని కోరారు.
రోడ్డుపై దర్శనమిచ్చిన దరఖాస్తులు, ప్రభుత్వం సీరియస్
ప్రజాపాలన దరఖాస్తుల రోడ్లపై పడటాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. దరఖాస్తుల రవాణా విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు చేపట్టింది. హయత్ నగర్ సర్కిల్ లో వాల్యుయేషన్ ఆఫీసర్ ఎస్ మహేందర్ పై జీహెచ్ఎంసీ వేటు వేసింది. వార్డు నెంబర్ 13కు మహేందర్ టీమ్ లీడ్ గా పని చేశారు. హైదరాబాద్ కూకట్‌పల్లి వై జంక్షన్ వైపు నుంచి వస్తున్న ఓ వ్యక్తి బైక్‌పై నుంచి దరఖాస్తులు ఎగిరి కింద పడ్డాయి. బాలానగర్ వంతెనపై చిందరవందరగా పడటంతో వాహనదారుడు...బైక్‌ను పక్కకు నిలిపేసి కిందపడిన దరఖాస్తులను తీసుకుంటుండగా స్థానికులు గుర్తించారు. రోడ్డుపై పడిపోయిన దరఖాస్తులను రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలానికి చెందినవిగా గుర్తించారు. ప్రజాపాలన దరఖాస్తులపై విచారణకు అదేశించిన అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.
కోటి 25 లక్షల దరఖాస్తులు
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల కోసం ప్రజల భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా కోటి 25లక్షల 84వేల 383వందల దరఖాస్తులు వచ్చాయి. మహాలక్ష్మి, పెన్షన్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు పది రోజుల పాటు ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించింది. చివరి రోజే 12లక్షల 53వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
కాంగ్రెస్ గ్యారెంటీలు
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతీ నెలా రూ.2,500 నగదు, పేద మహిళలకు కేవలం ₹500కే వంట గ్యాస్ సిలిండర్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. రైతు భరోసా కింద ప్రతిఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పింది. వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింది ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పింది. గృహజ్యోతి పథకం కింద పథకం కింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనుంది. చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా, చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్. యువ వికాసం కింద కళాశాల విద్యార్థుల కోచింగ్ ఫీజు కోసం రూ.5 లక్షల వరకు సాయం చేస్తామని చెప్పింది.