KA Paul: కేసిఆర్ నా టాలెంట్ వాడుకోవడం లేదు- సమ్మిట్ పెట్టిస్తే బిలియన్ డాలర్లు తెస్తా: కేఏ పాల్
వాడుకోండి బాబు... నా టాలెంట్‌ను వాడుకోండి అంటున్నారు కేఏ పాల్. ఒక్క సమావేశం పెట్టించండి బిలియన్ డాలర్లు తెప్పిస్తానంటూ సవాల్ చేస్తున్నారాయన.
ఎంతో టాలెంట్ ఉన్న తనను ఎవరూ వాడుకోవడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్. ఉద్యమం టైంలో చాలా సార్లు తనను కలిసిన కేసీఆర్ ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. కేటీఆర్ విషయం తెలియకుండా ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారంలో ఉండి ఏమీ చేయకుండా ఇతరులపై నిందలు వేస్తే లాభం లేదని సూచించారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చేందుకు చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఉదాహరణతో కేఏపాల్ వివరించారు. ప్రజాసమస్యలు, వాగ్దానాలపై మాట్లాడుకుండా పొలిటికల్ పార్టీలు తిట్టుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయని కామెంట్ చేశారు. అలా చేయడం వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రం ఏర్పడే నాటికి నెంబర్ వన్‌గా తెలంగాణను కేసీఆర్ అప్పులు పాలు చేశారని విమర్శించారు కేఏ పాల్. ఇప్పుడు ఎక్కడా అప్పులు దొరకడం లేదన్నారు. అందుకే ఒక్క సమ్మిట్ పెట్టించండీ అని ఎనిదేళ్ల నుంచి తిరుగుతున్న పట్టించుకున్న వారు లేరని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఒక్కో సమ్మిట్ పెట్టిస్తే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో బిలియన్ డాలర్లు తీసుకొస్తానన్నారు. లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. అలా చేయని పక్షాన తనను జైల్లో పెట్టాలని పాస్‌పోర్టు తీసుకోవచ్చన్నారు.
ఇప్పుడు ఉన్న అన్ని పార్టీలు అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయని ఇలాంటి పార్టీలకు ఓట్లు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అభిప్రాయపడ్డారు కేఏ పాల్. తెలంగాణలో కూడా కేసీఆర్ గెలిచే పరిస్థితి లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు తెలిపారు. ఆయనకు 30 వరకు సీట్లు రావని స్పష్టమైందన్నారు. కచ్చితంగా తామే తెలంగాణలో అధికారంలోకి వస్తామన్నారు. తమకు స్ట్రాటజిస్టులు అవసరం లేదని.. నడవలేని స్థితిలో ఉన్న బైడెన్‌నే అమెరికా అధ్యక్షుడిని చేశానని గుర్తు చేశారు. అందుకే మార్పు రావాలంటే ఆయా పార్టీల్లో ఎవరూ ఉండొద్దని సూచించారు. ఇంటికో పార్టీ ఉంటే మార్పు రాదన్నారు.
సీఎం కేసీఆర్ తనను వాడుకోవడం లేదని ఆవేదన చెందారు కేఏపాల్. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వస్తుందని జనవరిలోనే చెప్పానన్నారు. ఫిబ్రవరి వరకు వారి సమస్య ఎవరూ పట్టించుకోలేదన్న పాల్... తాను నిరాహారదీక్ష చేస్తే అమెరికా అధ్యక్షుడు అప్పటికప్పుడు సమావేశాలు పెట్టి యుద్ధ నివారణ చర్యలు చేపట్టారన్నారు. తాను పెట్టిన ఏడు కండీషన్లకు అంగీకరించారని... దీక్ష విరమించిన తర్వాత మళ్లీ వాటిని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉక్రెయిన్, రష్యా రెండూ నాశనమయ్యాయన్నారు.
మన రాష్ట్రంలోని ఎంపీలు గట్టిగా నిలబడి ఉంటే ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరిగేది కాదన్నారు కేఏపాల్. మనోళ్లు తెలివితేటలు ఉపయోగించడం లేదని విమర్శించారు. మోదీని గట్టిగదా అడగాల్సిన వాళ్లు సైలెంట్‌గా ఉంటున్నారన్నారు. అందుకే దేశంలో మోదీ, ఆంధ్రప్రదేశ్‌లో జగన్, తెలంగాణలో కేసీఆర్ పూర్తిగా ఫెయిల్ అయ్యారన్నారు. అలాంటి వారిని ప్రజలు మళ్లీ ఎలా గెలిపిస్తారని ప్రశ్నించారు.
తాను పోరాడుతుంది భవిష్యత్ తరాల కోసమన్నారు కేఏపాల్. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టిన లొంగలేదని గుర్తు చేశారు. బీజేపీ వాళ్లు పిలిచి ఉపప్రధానమంత్రి పదవి ఇస్తానన్నారని తెలిపారు. అమిత్‌షా, మోదీ సమక్షంలోనే దీనిపై చర్చలు జరిగినట్టు వివరించారు. దీని కోసం తొమ్మిది సమావేశాలు జరిగాయన్నారు తాను మాత్రం అంగీకరించలేదన్నారు. చంద్రబాబు తనకు రాజ్యసభ ఇస్తానంటే తిరస్కరించినట్టు తెలిపారు.
తాను ఎన్నికలు అయ్యే వరకు దేశంలోనే ఉంటానని పాదయాత్ర చేయబోతున్నట్టు ప్రకటించారు. దేశంలోని అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతాన్నారు. రెండు కళ్లు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు సర్వేలు చూస్తే తెలంగాణలో 72 సీట్లు, ఆంధ్రప్రదేశ్102 సీట్లు వస్తాయని అభిప్రాయపడ్డారు.