Modi Hyderabad Tour: మోదీ హైదరాబాద్ టూర్ డేట్ ఫిక్స్ - రెండో వందేభారత్ ట్రైన్ ప్రారంభించనున్న ప్రధాని
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
![Modi Hyderabad Tour: మోదీ హైదరాబాద్ టూర్ డేట్ ఫిక్స్ - రెండో వందేభారత్ ట్రైన్ ప్రారంభించనున్న ప్రధాని PM Modi Hyderabad Tour confirms in april 8th, Inagurates Secunderabad Tirupati Vande bharat express Modi Hyderabad Tour: మోదీ హైదరాబాద్ టూర్ డేట్ ఫిక్స్ - రెండో వందేభారత్ ట్రైన్ ప్రారంభించనున్న ప్రధాని](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/27/e98066b3c681703107f7c5c2579e313a1679893367355234_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తేదీ ఖరారు అయింది. ఏప్రిల్ 8న ప్రధాని హైదరాబాద్‌కు రానున్నారు. ఆ పర్యటన సందర్భంగా కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడపాలని భావిస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రెండో వందేభారత్ రైలు ఇది. అదే సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ రెండు కార్యక్రమాల కోసం రైల్వే శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.
తెలుగు రాష్ట్రాల మధ్య, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడవనున్న రెండో వందేభారత్ రైలును సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడపాలని నిర్ణయించారు. ఈ మార్గంలో ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తయింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఉన్న మూడు రైలు మార్గాల్లో వందేభారత్ రైలును ఏ రూట్‌లో నడపాలనే దానిపై అధికారులు అధ్యయనం చేసి ఖరారు చేశారు. అందులో బీబీనగర్, ఖాజీపేట, విజయవాడ మీదుగా రైలును నడపడంపై అధ్యయనం చేశారు.
ప్రస్తుతం నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ నడుస్తున్న మార్గంలోనే ఈ వందేభారత్ రైలును నడపాలని రైల్వే అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్-బీబీనగర్, నల్గొండ, గుంటూరు, తెనాలి, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి మీదుగా తిరుపతికి నడపాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే సమయంలో పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం మీదుగా ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి మీదుగా నడపేలా కూడా అధికారులు సర్వే చేశారు. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ నడుస్తున్న రూట్‌లో ఈ వందేభారత్ రైలును పిడుగురాళ్ల వరకు నడిపి, అక్కడి నుంచి శావల్యాపురం వైపు మళ్లించే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం 12 గంటలు, వందే భారత్‌తో 7 గంటలలోపే
ప్రస్తుతం సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దాదాపు 12 గంటలదాకా సమయం పడుతోంది. అదే వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం 6 నుంచి 7 గంటలలోపునకే ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది.
గత జనవరి 15న రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభించిన సికింద్రాబాద్ - విశాఖపట్నం వందేభారత్ రైలు విజయవంతంగా నడుస్తోంది. ఈ రైలు రాకతో రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 4 గంటల దాకా తగ్గింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)