Kaushik Reddy: ఈటల నుంచి రేవంత్‌కు రూ.25 కోట్లు - కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు
Telangana News: బీఆర్ఎస్ మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో కౌశిక్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తన అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే ఈటల మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసేందుకు వచ్చారని అన్నారు.
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. హుజురాబాద్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని రూపాయి మల్కాజ్ గిరిలో సార్వత్రిక ఎన్నికల్లో ఎట్లా చెల్లుతదని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. హుజూరాబాద్, గజ్వేల్ ప్రజలనే కాకుండా అన్నం పెట్టిన కేసీఆర్ ను కూడా ఈటల రాజేందర్ మోసం చేసిండని కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు మల్కాజ్ గిరి ప్రజలను మోసం చేసేందుకు ఈటల ఇక్కడ పోటీ చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో కౌశిక్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
తన అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే ఈటల ఇక్కడ పోటీ చేసేందుకు వచ్చాడు. దేవుడి బొట్టు కూడా పెట్టుకోని ఈటల రాజేందర్ దేవుడి గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. రాగిడి లక్ష్మారెడ్డి పక్కా లోకల్. చదువుకున్న ఆయనను గెలిపిస్తే ప్రజల సమస్యలను పార్లమెంట్ లో వినిపిస్తడు. బీఆర్ఎస్ కు కేసీఆర్, కేటీఆర్ ఉన్నారు. రేవంత్ రెడ్డి మన వెంట్రుక కూడా పీకలేడు. మల్కాజ్ గిరి ఎంపీగా ఐదేళ్లలో రేవంత్ రెడ్డి ఒక్కసారైనా ముఖం చూపించిండా. బీజేపీతో కుమ్మక్కై డమ్మీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజ్ గిరిలో నిలబెట్టిండు. హుజురాబాద్ లో ఈటల దగ్గర రూ.25 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఆయనకు సహకరించిండు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి. పదేళ్లలో కేసీఆర్ చేసినంత అభివృద్ధిని ఎవరైనా చేశారా? ఈటల రాజేందర్ అనే వ్యక్తి మోసగాడు. హుజురాబాద్ లో ప్రజలు బుల్లెట్ దింపినట్లే.. మల్కాజ్ గిరి ప్రజలు కూడా ఆయనకు బుల్లెట్ దింపాలే’’ అని కౌశిక్ రెడ్డి మాట్లాడారు.
గత ఎన్నికల్లో ప్రత్యర్థులు
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈటల రాజేందర్, కౌశిక్ రెడ్డి ప్రత్యర్థులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి ఈటల రాజేందర్ పైన గెలుపొందారు. దాదాపు 17 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంతకుముందు 2021లో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో హుజూరాబాద్ లో ఈటల ఓటమితో ప్రస్తుతం మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయడానికి బీజేపీ అధిష్ఠానం అవకాశం కల్పించింది.