TSRTC చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు
TSRTC Chairman Muthireddy: టీఎస్ ఆర్టీసీ నూతన చైర్మన్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
TSRTC Chairman Muthireddy:
హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ నూతన చైర్మన్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లోని సంస్థ అధికారిక కార్యాలయం బస్ భవన్ లోని తన ఛాంబర్ లో ఆదివారం ముత్తిరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy)కి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఇతర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేసి.. సన్మానించారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం TSRTC చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మాట్లాడుతూ.. అనుభవుజ్ఞులైన ఎండీ వీసీ సజ్జనర్ నేతృత్వంలో టీఎస్ఆర్టీసీ అన్ని విభాగాల్లో ముందుకు దూసుకుపోతోందని అన్నారు. తనపై నమ్మకంతో ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగించిందందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. తన శక్తి మేరకు ఆర్టీసీ సంస్థ వృద్ధికి పాటుపడతానని ముత్తిరెడ్డి పేర్కొన్నారు. సంస్థ ఉద్యోగులతో తాను ఒకరిగా సమిష్టిగా పని చేసి, టీఎస్ఆర్టీసీ లాభాల బాటవైపునకు తీసుకెళ్తామని వివరించారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా తనను నియమించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్ తోపాటు చైర్మన్ యాదగిరి రెడ్డి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని సీఎం కేసీఆర్ అక్టోబర్ 5న నియమించారు. తెలంగాణ రైతు సంక్షేమ సంఘాల సమితి చైర్మన్ గా తాటి కొండ రాజయ్య నియమితులు అయ్యారు.
చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్దన్ పదవీ కాలం పూర్తి
ఎస్ ఆర్టీసీ చైర్మన్ గా పదవీ కాలం పూర్తయిన సందర్భంగా బాజిరెడ్డి గోవర్దన్ కి సంస్థ ఉన్నతాధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. బాజిరెడ్డి గోవర్దన్- వినోద దంపతులను ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ లోని బస్ భవన్ లో బాజిరెడ్డి గోవర్దన్ గారికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని అక్టోబర్ 3న టీఎస్ఆర్టీసీ నిర్వహించింది. గత రెండేళ్లలో TSRTC మెరుగైన ఫలితాలు సాధించింది. ఆర్టీసీ సిబ్బంది సైతం ప్రభుత్వ ఉద్యోగులు కావడం, వేల కోట్ల నష్టాన్ని భర్తీ చేశారు. ఇందుకు కారణం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ సజ్జనార్ కృషి అని చెప్పవచ్చు.
వీడ్కోలు సందర్భంగా ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ.. రాజకీయ నాయకుడిగా 40 ఏళ్లుగా పనిచేస్తున్నా, రెండేళ్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు నిర్వర్తించడం సంతృప్తి ఇచ్చిందన్నారు. చిన్నతనం నుంచే ఆర్టీసీతో తనకు అనుబంధముందన్నారు. తాను, ఎండీగా సజ్జనర్ 18 రోజుల వ్యవధిలోనే బాధ్యతలు స్వీకరించామని, తమకు ఎన్నో సవాళ్లు తమకు స్వాగతం పలికాయని గుర్తు చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూనే.. 45 వేల ఉద్యోగులకు భరోసా కల్పించాలని తపించామని చెప్పారు. తన పదవీ కాలంలోనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అధికారులు, ఉద్యోగుల సమిష్టి కృషితోనే సత్పలితాలు వస్తున్నాయన్నారు. తన విధి నిర్వహణలో తోడ్పాటు అందించిన సంస్థ ఎండీ సజ్జనర్ తో పాటు అధికారులు, ఉద్యోగులకు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.