Telangana Bonalu: బోనాల కోసం ఈసారి రూ.15 కోట్లు, మంత్రి తలసాని రివ్యూ, ముఖ్య తేదీలు ఇవే
Telangana Bonalu: జూన్ 30న గోల్కొండ బోనాలతో ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయి.
![Telangana Bonalu: బోనాల కోసం ఈసారి రూ.15 కోట్లు, మంత్రి తలసాని రివ్యూ, ముఖ్య తేదీలు ఇవే Minister Talasani srinivas yadav reviews over Bonalu festival, Golconda bonalu starts form june 30 Telangana Bonalu: బోనాల కోసం ఈసారి రూ.15 కోట్లు, మంత్రి తలసాని రివ్యూ, ముఖ్య తేదీలు ఇవే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/21/d100c68b618948e2f755b75b44012470_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఈ నెల 30 నుండి గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. బోనాల నిర్వహణ కోసం ఏర్పాట్లపై సమీక్ష మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం (జూన్ 21) సమీక్ష నిర్వహించారు. బోనాల సందర్భంగా జగదాంబ మహంకాళి అమ్మ వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తామని మంత్రి తలసాని తెలిపారు. బోనాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తలసాని వివరించారు.
జూన్ 30న గోల్కొండ బోనాలతో ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయి. జులై 17న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, జులై 18న రంగం, భవిష్యవాణి జరగనున్నాయి. జులై 24న భాగ్యనగర బోనాలు, జులై 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు ఉంటుంది. జులై 28వ తేదీన గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ముగియనున్నాయి.
ఆషాఢ బోనాలు
ఆషాడ బోనాల జాతర అంటే గ్రామదేవతలను పూజించే పండుగ. బోనం అంటే భోజనం అని అర్థం. అన్నం కొత్తకుండలో వండి ఊరేగింపుగా వెళ్లి గ్రామదేవతలకు భక్తితో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం కూడా పోస్తారు. దానిపై దీపం పెట్టి బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేపకు కట్టి పసుపు కలిపిన నీళ్లు చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తారు. ఈ విధంగా బోనాలు సమర్పిస్తే గ్రామ దేవతలు శాంతించి అంటు వ్యాధులు రాకుండా కాపాడుతారని భక్తులు నమ్ముతారు.
తెలంగాణ వచ్చాక రాష్ట్ర పండుగగా..
తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బోనాల జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. బోనం దేవతలకు సమర్పించే నైవేథ్యం, మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం కలిపిన బోనాన్ని మట్టి , ఇత్తడి లేక రాగి కుండలలో మహిళలు తలపై పెట్టుకుని డప్పులతో సంబరంగా గుడికి వెళ్తారు.
బోనాలలో పోతురాజు వేషం
మహిళలు బోనాలు తీసుకెళ్లే కుండలను చిన్న వేప రెమ్మలతో పసుపు, కుంకుమ, బియ్యం పిండి ముగ్గుతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచుతారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మలుగా పిలుచుకునే గ్రామ దేవతల గుళ్లను సుందరంగా అలంకరించుకుని బోనాలు సమర్పిస్తారు. బోనాల సందర్భంగా పోతురాజు వేషానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలు తన పుట్టింటికి వెళతారని భక్తులు నమ్ముతారు. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన అనుభూతిని పొందుతారు. ఈ భావనతో భక్తి శ్రద్ధలతో బోనాలను ఆహార నైవేథ్యంగా దేవికి సమర్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఊరడి అంటారు. పలు ప్రాంతాల్లో పెద్ద పండుగ, వంటల పండుగ అనే పేర్లతో పిలుస్తారు. కాలానుగుణంగా ఇది బోనాలుగా మారింది. బోనాల సందర్భంగా పొట్టేళ్ల రథంపై అమ్మవారిని ఊరేగిస్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)